Sunday, April 28, 2024

Rice Bowl – అన్న‌పూర్ణ‌ మన తెలంగాణ…ద‌క్షిణాదికి మ‌న‌మే ఆస‌రా

ప‌లు రాష్ట్రాల్లో నెల‌కొన్న‌ వర్షభావ పరిస్థితులు
తెలంగాణ బియ్యానికి పెరిగిన‌ డిమాండ్‌
కేరళ, కర్నాటకు ఇక్క‌డి నుంచే ఎగుమతి
కేరళ నుంచి 2లక్షల టన్నుల బియ్యానికి ఆర్డర్‌
బియ్యం కావాల‌ని క‌న్న‌డ‌ ప్ర‌భుత్వం నుంచి రిక్వెస్ట్‌
వర్షభావ పరిస్థితుల్లోనూ లక్ష్యం మేరకు సాగైన వరి
యాసంగి సీజ‌న్‌లోనూ ఆదుకోనున్న వ‌రి పంట‌
సీఎంఆర్‌లో జాప్యంతో త‌లెత్తిన ఇబ్బందులు
బ‌హిరంగ మార్కెట్‌కు త‌ర‌లిస్తున్న మిల్ల‌ర్ల‌
పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అధికారుల చ‌ర్య‌లు
క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌ని సీరియ‌స్ హెచ్చ‌రిక‌లు
మిల్ల‌ర్ల నుంచి తిరిగి చేరుతున్న బియ్యం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో నెలకొన్న తీవ్ర వర్షభావ పరిస్థితులతో తెలంగాణ బియ్యానికి డిమాండ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది వానాకాలం సీజ‌న్‌లో దక్షిణాదిలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో పలు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వరి పంట‌ సాగు కాలేదు. ఈ ఏడాది తెలంగాణలోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవనప్పటికీ వానాకాలం సీజ‌న్‌లో లక్ష్యం మేరకు 60 లక్షల ఎకరాల్లో వరి పంట‌ సాగయ్యింది. ఇక‌.. ఈ యాసంగిలోనే దాదాపు 10 లక్షల మేర తక్కువగా 50 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైన‌ట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర‌ అవసరాలకు సరిపోను మిగులు బియ్యం అందుబాటులో ఉండడంతో దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ నుంచి బియ్యం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి.

తెలంగాణ బియ్యానికి పెరిగిన డిమాండ్‌..

కొద్ది రోజులుగా తెలంగాణ బియ్యానికి డిమాండ్‌ భారీగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం నుంచి దక్షిణ భారత్‌లోని ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎక్కువగా ఎగుమతి కానుందని పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో దుర్భిక్షం నెలకొనగా, కర్నాటకలోని చాలా ప్రాంతాలు కరవు పరిస్థితులను ఎదుర్కొంటు-న్నాయి. ఈ రెండు రాష్ట్రాలకు నెలకు 4 లక్షల టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సరఫరా చేస్తోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఇంకా ఎక్కువగానే సరఫరా చేయాల్సి ఉంటుందని పౌరసరఫరాలశాఖ, ఎఫ్‌సీఐ వర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

- Advertisement -

మిల్లింగ్‌లో జాప్యం.. అందుకే ఆల‌స్యం

2015-16కు ముందు ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోలు చేసేది. అయితే.. 2015-16 నుంచి ధాన్యం సేకరణను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతుండడంతో పౌరసరఫరాలశాఖ ప్రాధాన్యం పెరిగింది. రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు ఇస్తే … మిల్లర్లు మరాడించి సీఎంఆర్ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌)ను తిరిగి ఎఫ్‌సీఐకి అప్పజెప్పాలి. ఆరు నెలల క్రితం వరకు మిల్లర్లు బియ్యాన్ని పూర్తిగా ఇవ్వకపోవడం, ధాన్యాన్ని బహిరంగమార్కెట్‌లో అమ్ముకోవడంతో తీవ్ర జాప్యం నెలకొంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ కఠినంగా వ్యవహరిస్తుండడంతో వానాకాలం సీజ‌న్‌ బియ్యం పూర్తిగా మిల్లర్ల నుంచి తిరిగొచ్చింది. మరోవైపు ప్రస్తుత యాసంగిలో ధాన్యం సేకరణకు, మిల్లర్ల నుంచి పూర్తిస్థాయిలో బియ్యాన్ని తిరిగి తీసుకునేందుకు పౌరసరఫరాల సంస్థ ఏర్పాట్లు- చేసి ఉంచింది. బియ్యం అందిన వెంటనే, అందుకు సంబంధించిన పైకాన్ని జాప్యం చేయకుండా చెల్లించేందుకు ఎఫ్‌సీఐ కూడా అంగీకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ సేకరించిన బియ్యాన్ని ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తోంది.

కేరళకు 2లక్షల టన్నుల తెలంగాణ బియ్యం

కేరళ రాష్ట్రానికి తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతి జ‌ర‌గ‌నుంది. దాదాపు 2లక్షల టన్నులకు పైగా కేరళకు బియ్యాన్ని పంపించేందుకు పౌరసరఫరాలశాఖ చర్యలు చేపడుతోంది. ముందుగా మలయాళ రాష్ట్రానికి వెయ్యి టన్నుల బియ్యాన్ని పంపించాలన అధికారులు నిర్ణ‌యించారు. తెలంగాణ నుంచి బియ్యం కోసం కేరళ అధికారులు ఇప్పటికే పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులతో సంప్రదింపులు పూర్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement