Thursday, May 2, 2024

Condolence – శాంతి స్వరూప్ మృతికి రేవంత్ సంతాపం..

హైదరాబాద్ తొలి తరం న్యూస్ రీడర్ గా తెలుగు ప్రజలందరికీ సుపరిచితులైన శాంతిస్వరూప్ గారి మరణం బాధాకరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 1983 నుంచి న్యూస్ రీడర్ గా శాంతిస్వరూప్ తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు. సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్ ద్వారా ఆయన అందించిన సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయం అని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. శాంతిస్వరూప్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు..

శాంతి స్వరూప్ మరణం పట్ల చంద్రబాబు దిగ్ర్భాంతి..

తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ మరణం దిగ్భ్రాంతి కలిగించిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగు దూరదర్శన్‌లో వార్తలు అనగానే మొదటిగా గుర్తొచ్చేది ఆయనేనని చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్ చేశారు. ”నేను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేమిద్దరం కలిసి ప్రతి సోమవారం ‘ప్రజలతో ముఖ్యమంత్రి’ కార్యక్రమం చేసేవాళ్లం. ఆరేళ్ల పాటు సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు నేరుగా తమ సమస్యలను చెప్పుకొని పరిష్కారం పొందేవారు. ఆ విధంగా మా అనుబంధం సుదీర్ఘమైనది. శాంతి స్వరూప్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా” అని చంద్రబాబు పేర్కొన్నారు.

శాంతి స్వ‌రూప్ కు నారా లోకేష్ నివాళి..

దూరదర్శన్ అంటే వార్తలు… వార్తలు అంటే శాంతిస్వరూప్ గారు అన్నంతగా తెలుగు వీక్షకులకు దగ్గరైన శాంతిస్వరూప్ గారి మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు. శాంతిస్వరూప్ గారికి కన్నీటి నివాళులు అర్పిస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement