Sunday, April 28, 2024

TS – మార్చి 31 లోగా లే అవుట్ లు క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ – రేవంత్ నిర్ణ‌యం..

హైద‌రాబాద్ – 2020 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్చి 31 లోగా దరఖాస్తులకు లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఆదాయ సమీకరణ, వనరులపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయ, వక్ఫ్‌, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే అవుట్‌లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో.. 20 లక్షల మంది దిగువ, మధ్య తరగతి వర్గాలకు చెందిన దరఖాస్తుదారులకు మేలు కలుగుతుంది.

ఏమిటీ ఎల్‌ఆర్‌ఎస్‌..
అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు తీసుకొచ్చిందే ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం). ప్రభుత్వ విధివిధానాలు పాటించకుండా నిర్మించిన లే అవుట్లు, అక్రమ స్థలాల్లో నిర్మించిన లే అవుట్లను అన్ అప్రూవుడ్ లే అవుట్లు అంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఇలాంటి స్థలాలను తప్పకుండా క్రమబద్ధీకరించుకోవాలి. ఇందుకోసం 2020లో ఎల్ఆర్ఎస్-2020 (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్-2020) పేరుతో మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఎల్‌ఆర్‌ఎస్‌ ఉద్దేశమేంటంటే..
అధికారిక లేఅవుట్‌లో పది శాతం స్థలాన్ని ఖాళీగా వదలాల్సి ఉంటుంది. కానీ.. అనధికారిక లేఅవుట్లలో ఖాళీ స్థలం ఉండదు. దీంతో జనావాసాల్లో సౌకర్యాలు సరిగా ఉండవని, అలాంటి లేఅవుట్లలోని ఇళ్ల స్థలాల నుంచి 0.14శాతం ఓపెన్‌ ల్యాండ్‌ ఛార్జీలను వసూలు చేస్తారు. ఆ డబ్బుతో కొంత ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి.. అనధికార లేఅవుట్‌లోని కాలనీకి కేటాయించాలన్నది ముఖ్యోద్దేశం. కానీ.. జీహెచ్‌ఎంసీ ప్రణాళిక విభాగం ఎల్‌ఆర్‌ఎస్‌ను ఆదాయ వనరుగానే చూస్తోంది. ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద రూ.100కోట్లకుపైగా రుసుము వసూలు చేయగా, అందులో ఒక్క రూపాయిని కూడా ఉద్దేశించిన లక్ష్యం కోసం వెచ్చించలేదు.

ఎదురుచూపులే..
అయితే.. రాష్ట్రంలో లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద దరఖాస్తు చేసుకున్న ఎంతోమంది గత మూడున్నరేళ్లుగా ఎదురుచూపులు చూస్తున్నారు. నగర, పురపాలికలు; పంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో గత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంతో 25 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. ఈ మేరకు క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.

తాజాగా కదలిక..
అయితే 20లక్షల మందికి పైగా లబ్ధి చేకూర్చే.. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఔట్‌లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. మార్చి 31లోపు దరఖాస్తుదారులకు ఈ అవకాశం కల్పించనుంది. సోమవారం ఆదాయ సమీకరణ, వనరులపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

అనధికారిక అంచనాల ప్రకారం అందిన దరఖాస్తుల్లో అర్హమైన వాటిని క్రమబద్ధీకరించడం ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

ఎక్సైజ్లో అక్రమాలు అరికట్టాలి
అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని, వాణిజ్య పన్నుల శాఖలో టార్గెట్లు పూర్తి చేయాని, ఎక్సైజ్ శాఖలో అక్రమాలను అరికట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో రాష్ట్ర ఆదాయ సేకరణపై సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ సోమవారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్,రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, రవాణా, మైన్స్ అండ్ జియాలజీ, టీఎస్ఎండీసీ విభాగాల్లో ఆదాయ సేకరణ వివరాలపై ఆరా తీశారు.ఆర్థిక సంవత్సరాలవారీగా ఆదాయ సేకరణ, పన్నుల వసూళ్ల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశం.ఎక్సైజ్ విభాగంలో అక్రమాలను అరికట్టి పూర్తి స్థాయిలో ట్యాక్స్ వసూళ్లు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని అన్ని డిస్టీలరీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. బాటిల్ ట్రాకింగ్ ఉండేలా తయారీ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement