Tuesday, May 7, 2024

ట్రాన్స్‌ఫార్మ‌ర్ వ‌ద్ద రిపేర్లు, ఎల్‌సీ రిటన్ ఇవ్వ‌క‌ముందే పవర్​ స‌ప్ల‌య్‌.. రైతుతో పాటు విద్యుత్ సిబ్బందికి తీవ్ర‌గాయాలు

మరిపెడ, (ప్ర‌భ న్యూస్‌): ఓ విద్యుత్‌శాఖ ఉద్యోగి నిర్ల‌క్ష్యం రైతు ప్రాణాల మీద‌కు తెచ్చింది. ట్రాన్స్‌ఫార్మ‌ర్ వ‌ద్ద రిపేరు చేస్తుండ‌గా విద్యుత్ స‌ప్ల‌య్ కావ‌డంతో నిచ్చెన ప‌ట్టుకున్న రైతుతో పాటు మ‌రో విద్యుత్ సిబ్బంది బిచ్చ‌కు గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబాద్ జిల్లాలో ఇవ్వాల (ఆదివారం) జ‌రిగింది. మ‌రిపెడ మండ‌లం ల‌చ్చ తండా ప‌రిధిలోని సోమ్లా తండాలో రైతు, విద్యుత్ సిబ్బందికి తీవ్ర గాయాల‌య్యాయి. మ‌రిపెడ ఏఈ వంశీ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మరిపెడ మండలం సోమ్లా తండాలోని వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే ట్రాన్స్‌ఫార్మ‌ర్‌ వద్ద జంప‌ర్ క‌ట్ కావ‌టంతో స‌రిచేయాల‌ని రైతులు సంబంధిత ఎడ్జెర్ల స‌బ్‌స్టేష‌న్ విద్యుత్ సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. దీంతో విద్యుత్ సిబ్బంది బిచ్చ స‌బ్‌స్టేష‌న్లో విధుల్లో ఉన్న ఆర్టిజ‌న్ మ‌ధు వ‌ద్ద ఎల్‌సీ తీసుకుని స‌ద‌రు ట్రాన్స్‌ఫార్మ‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాడు.

అప్ప‌టికే బిచ్చు కాలికి గాయం ఉండ‌టంతో సోమ్లా తండాకు చెందిన రైతు వినోద్ నిచ్చెన సాయంతో ట్రాన్స్‌ఫార్మ‌ర్ ఎక్కి స‌రిచేస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఎల్‌సీ రిట‌ర్న్ ఇవ్వ‌క ముందే స‌బ్‌స్టేష‌న్‌లో విధుల్లో ఉన్న మ‌ధు నిర్ల‌క్ష్యంగా లైన్‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా ఆన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో రిపేరు చేస్తున్న రైతు వినోద్‌కు చేతులు పూర్తిగా కాలిపోగా, ఛాతి భాగంలో తీవ్ర‌గాయాలయ్యాయి. నిచ్చెన ప‌ట్టుకున్న బిచ్చ‌కు స్వ‌ల్ప‌గాయాలైయ్యాయి. క్ష‌త‌గాత్రుడిని మానుకోట ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, ప‌రిస్థితి తీవ్రంగా ఉండ‌టంతో వ‌రంగ‌ల్ లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వినోద్ ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని, ఎడ్జెర్ల స‌బ్‌స్టేష‌న్ వ‌ద్ద‌కు చేరుకుని లైన్ పున‌రుద్ధ‌రించి, విచార‌ణ చేస్తున్నామ‌ని ఏఈ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement