Monday, May 6, 2024

KCR Fire – రైతుబంధును కాంగ్రెస్సే ఆపేసింది! రైతుల నోట్లో మట్టి కొట్టేసింది – కెసిఆర్

‘‘బీఆర్ఎస్​ పదేళ్లు పాలించింది.. 50 ఏళ్లుగా కాంగ్రెస్ పాలించింది. అప్పటికి, ఇప్పటికీ తేడా గమనించండి, బీఆర్ఎస్ పాలనలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఏంటో? కాంగ్రెస్ పాలనలో కష్టాలెన్నో బేరీజు వేయండి, ఎవరో చెప్పిన మాటలు విని ఆగమాగం ఓట్లు వేయొద్దు. ప్రలోభాలకు లొంగవద్దు” అని సీఎం కేసీఆర్​ అన్నారు. షాద్​నగర్​లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సభకు ప్రజలు పోటెత్తారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను సర్వనాశనం చేసిందని, ఎన్నో కష్టాలు పడ్డాం, మంచి నీరు లేదు. కరెంటు లేదు. అక్కడి వరకూ దేనికి తాగునీటికి అరిగోస పడిన ప్రాంతం షాద్​నగర్​. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ముంచింది. ప్రలోభాలకు లొంగవద్దు. అన్ని బాధలే. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారని, నిజంగా ఇందిరమ్మ రాజ్యం చక్కగా ఉంటే.. ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టేటోడు.. ఆయన రెండు రూపాయాలకే కిలో బియ్యం ఇచ్చంత వరకూ ఇక్కడ ఆకలే కదా? ఇదే కదా మనం చూసిన ఇందిరమ్మ రాజ్యం.. అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

రైతులను ఆదుకునేందుకు రైతుబంధు తెచ్చాం..
వ్యవసాయాన్ని స్థిరీకరించేందుకు రైతులను ఆదుకునేందుకు రైతు బంధు తీసుకు వస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ అడ్డుకుంది. కాంగ్రెస్ నాయకులూ రైతు బంధు తీసుకొంటున్నారు. కార్యకర్తలూ తీసుకుంటున్నారు. మీ కొంపల్నీ కాంగ్రెస్ పార్టీ కూల్చుతుంటే మీకు సిగ్గు కలగటం లేదా? రైతు నోటికాడ ముద్దను అడ్డుకుంటుంటే మీలో చలనం రాదా? 24 గంటల కరెంటు తీసి 3 గంటలు ఇస్తామంటుంటే.. మీరెందుకు కాంగ్రెస్ పార్టీ వెనక ఉంటారు? అని కాంగ్రెస్ కార్యకర్తలను సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

దళిత బంధు తెచ్చింది బీఆర్​ ఎస్​..
దళితబంధు పథకాన్ని తీసుకువచ్చిందే బీఆర్ఎస్.. ఈ పథకంపైనా కాంగ్రెస్ పార్టీ ఉల్టా ప్రచారం చేస్తోందని సీఎం కేసీఆర్​ అన్నారు. అసైన్డ్ భూములు గుంజుకుంటామని లంగా , బద్మాష్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నాళ్లు భూమిపై హక్కు లేకుండా దళిత కుటుంబాలు బతకాలనే అసైన్డ్ భూముల చట్టాన్ని తీసుకు వస్తున్నామని చెప్పారు. గెలిచేది బీఆర్ఎస్సే, తొలి కేబినేట్ మీటింగ్​లోనే అసైన్డ్ భూములపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. షాద్​నగర్ అభివృద్ధే లక్ష్యంగా అంజయ్య యాదవ్ పని చేస్తున్నారని, ఇక్కడికి మెట్రో రైలు కావాలని అడిగాడని, తప్పని సరిగా మెట్రో సదుపాయం కల్పిస్తామని కేసీఆర్​ అన్నారు. దీంతో భూముల ధరలు మూడింతలు పెరుగుతాయని, అంతే కాదు.. అనేక విద్యాసంస్థలు వస్తాయని, కాలుష్యం లేని పరిశ్రమలు దండం పెట్టి మరీ షాద్​నగర్​కు వస్తాయని అన్నారు. షాద్​నగర్ ను సుభిక్షం చేసే లక్ష్మీ దేవీ పల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని, తక్కువ ముంపుతో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement