Sunday, April 28, 2024

Protest – ఆటోడ్రైవర్లను ఆదుకోవాలంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నిర‌స‌న‌….అసెంబ్లీ వ‌ద్ద టెన్ష‌న్ ..

హైదరాబాద్‌: ఆటోడ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ఆటోల్లో చేరుకున్నారు. ఎమ్మెల్యేలు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సుధీర్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వివేకానంద, మాధవరం కృష్ణారావు, పాడి కౌశిక్‌ రెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌.. హైదరాబాద్‌ హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు.

ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డుపై పడ్డాయన్నారు. రెండు నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే ఆటో కార్మికులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉందన్నారు. గిరాకీ లేక 6.5 లక్షల ఆటో కార్మికులు ఈఎంఐలు కట్టలేకపోతున్నారని, ఎంతోమంది ఉపవాసాలు ఉంటున్నారని వెల్లడించారు. చనిపోయిన డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ ఆటో కార్మికులకు నెలకు రూ.10 జీవన బృతి కల్పించే విధంగా పొందుపర్చాలన్నారు.

కాగా, ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలంటూ ఉన్న ప్లకార్డులను సభలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. . నల్ల కండువాలు వేసుకుని వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది సభలోకి అనుమతించలేదు. అయితే, కాసేపు వాగ్వాదం తర్వాత వారిని అనుమతించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement