Monday, April 29, 2024

లాక్ డౌన్ కఠినతరం.. 15 వేల వాహనాలు సీజ్

తెలంగాణలో లాక్‌ డౌన్ ను పోలీసుల కఠినతరం చేశారు. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ యథేచ్ఛగా రోడ్లపైకి వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు వారి నుంచి పోలీసులు 15 వేల వాహనాలను జప్తు చేశారు. కారణం లేకుండా బయటకు వచ్చే వారి వాహనాన్ని తాత్కాలికంగా జప్తు చేసి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు. జరిమానా చెల్లించినా లాక్‌ డౌన్ ఎత్తివేసిన తర్వాతే వాహనాన్ని ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు.

సడలింపు సమయం ముగిసిన తర్వాత రోడ్డుపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ మహేందర్‌రెడ్డి ఇటీవల హెచ్చరించారు. 10 గంటల తర్వాత రోడ్లపైకి వస్తే వాహనాలను జప్తు చేస్తామన్నారు. దీంతో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కారణం లేకుండా బయటకు వచ్చిన వారి నుంచి నిన్నటి వరకు ఏకంగా 15 వేల వాహనాలను పోలీసులు జప్తు చేశారు. మున్ముందు మరింత కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

మరోవైపు వాహనాల కదలికలను డ్రోన్ కెమెరాలు ద్వారా పర్యవేక్షిస్తున్నారు. పలుచోట్ల వాహనదారులు లాక్ డౌన్ ను లెక్క చేయడం లేదు. దీంతో అనుమతులు లేని వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ పాసులు ఉన్నవారిని మాత్రమే పంపిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి లాక్ డోన్ ఆంక్షలు కఠినతరం చేశారు. ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ కి సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. కాగా, లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన తరువాత గడిచిన 10 రోజుల్లో రాజకొండ కమిషనరేట్ పరిధిలో దాదాపు 25 వేలపై చిలుకు కేసులు నమోదు అయ్యాయి. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లఘించారని కేసులు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి 4.31 లక్షల కేసులు నమోదయ్యాయి. మాస్కు ధరించని వారి నుంచి రూ. 31 కోట్లను జరిమానాగా వసూలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement