Tuesday, April 30, 2024

వ‌ర‌దముంపు స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం : మంత్రి త‌ల‌సాని

ప్రతి ఏటా వర్షాకాలంలో వచ్చే వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బేగంపేట నాలా పరిసర ప్రాంత ప్రజల వరదముంపు సమస్యకు నాలాల సమగ్రాభివృద్ధి (ఎస్ ఎన్ డీపీ) కార్యక్రమంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని మున్సిపల్ పరిపాలన శాఖ కార్యాలయంలో మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో కలిసి జీహెచ్ ఎంసీ, వాటర్ వర్క్స్, రెవెన్యూ, దేవాదాయ తదితర శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ శర్మన్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఎస్ ఎన్ డీపీ ఈఎన్ సీ జియాఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… బేగంపేట నాలా కు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఎగువ నుండి వచ్చే వరద నీటితో బేగంపేట డివిజన్ లోని బ్రాహ్మణ వాడి, అల్లంతోట బావి, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాలలో ని ప్రజలు వరద ముంపుకు గురవుతున్నారని వివరించారు. ఎస్ ఎన్ డీపీ కార్యక్రమం క్రింద ఈ నాలా కు ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, ఆయా కాలనీల నుండి స్ట్రాం వాటర్ పైప్ లైన్, సీసీ రోడ్ల నిర్మాణం వంటి చర్యలతో ఆయా ప్రాంతాల ప్రజలకు వరదముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినట్లు అవుతుందని మంత్రి తెలిపారు. ఎస్ ఎన్ డీపీ ప్రాజెక్ట్ అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్దం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ముషీరాబాద్ మండల పరిధిలోని భోలఖ్ పూర్ లో గల సోమప్ప మఠం కు చెందిన 3,571 గజాల స్థలంలో సుమారు 130 నిరుపేద కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుండి నివసిస్తున్నాయని, వీరిలో 53 కుటుంబాలకు 1996 సంవత్సరంలో పట్టాలు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇక్కడ నివసిస్తున్న కుటుంబాల వారు విద్యుత్, నల్లా కనెక్షన్ వంటి సౌకర్యాలు పొందారని చెప్పారు.

ఈ స్థలాన్ని జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకొని, పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి వివరించారు. అదేవిధంగా ముషీరాబాద్ మండల పరిధిలోని జీరా కాంపౌండ్ లో సుమారు 70 కుటుంబాల వారు ఎన్నో సంవత్సరాలుగా ఇండ్లను నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారని, వీరికి రోడ్లు, విద్యుత్ వంటి సౌకర్యాలను కూడా ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. దేవాదాయ శాఖ కు చెందిన ఈ స్థలాన్ని జీహెచ్ ఎంసీ స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన పరిహారాన్ని చెల్లించేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. వీలైనంత త్వరగా స్థల సేకరణ జరిపితే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలను కూడా సిద్దం చేసినట్లు చెప్పారు. రాంగోపాల్ పేట డివిజన్ లోని 134 గృహాల వారు జీఓ 816 క్రింద 1994 సంవత్సరంలో రెగ్యులరైజేషన్ క్రింద దరఖాస్తు చేసుకున్నారని, సుప్రీంకోర్టులో పలు వివాదాలు పెండింగ్ లో ఉండటంతో ప్రభుత్వం రెగ్యులరైజేషన్ ప్రక్రియ కొనసాగలేదని వివరించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement