Sunday, April 28, 2024

Open Letter – 15 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నా …. కనికరించరా – రేవంత్ కు కేటీఆర్ లేఖ

హైదరాబాద్ ,- ఆటోలకు గిరాకీ లేకపోవడంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక ఇటీవలి కాలంలో ఏకంగా 15 మంది ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారంటే.. పరిస్థితి ఎంత చేజారిపోయిందో అర్థమైపోతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. . ఆటో డ్రైవర్ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ ను కోరారు . ఈ మేరకు రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఆటో డ్రైవర్ల సమస్యపై తన లేఖలో ప్రస్తావించారు. ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాలని పేర్కొన్నారు

ఆటోలు ఎక్కేవాళ్లు లేకపోవడంతో తమ కుటుంబం గడవని పరిస్థితిని వారు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 15 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా స్పందించరా ? అని ప్రశ్నించారు. గురువారం ఒక గిరిజన ఆటోడ్రైవర్ సోదరుడు ఏకంగా బేగంపేటలోని ప్రజాభవన్ ముందు తనకు ఇంతకాలం బువ్వపెట్టిన ఆటోను చేతులారా తగలబెట్టుకున్న సంఘటన చూసి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి గుండె బరువెక్కిందన్నారు. ఉపాధి లేక ప్రజాభవన్ ముందే ఆటోను తగలబెట్టుకున్నా కనికరించరా? అని మండిపడ్డారు.

అన్నం పెట్టిన ఆటో ఆకలి మంటల్లో కాలిపోయిన ఉదంతాన్ని చూసిన తరువాతైనా.. పరిస్థితి తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, రాష్ట్రంలోని 6.50 లక్షల మంది ఆటోడ్రైవర్ల పక్షాన కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్న ఆరున్నర లక్షల మంది డ్రైవర్లకు ప్రతినెలా 10 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు..

15 మంది ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమైన ప్రభుత్వం వెంటనే వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement