Saturday, May 18, 2024

కరీంనగర్‌లో ఒకటి, కడపలో ఒకటి.. 21 రాష్ట్రాల్లో కొత్త సైనిక్ స్కూల్స్‌ ఏర్పాటు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: 2022-23 విద్యాసంవత్సరానికి భాగస్వామ్య పద్ధతిలో రాష్ట్రానికొకటి చొప్పున 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 21 కోత్త సైనిక్‌ పాఠశాలల ఏర్పాటుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. కరీంనగర్‌ జిల్లాలోని తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ సైనిక్‌ స్కూల్‌, ఏపీలో వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని పూజా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను సైనిక్‌ స్కూల్‌గా ఏర్పాటు ఆమోదం లభించింది. ఎన్‌జీవోలు, ప్రైవేట్‌ పాఠశాలలు, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 21 కోత్త సైనిక్‌ పాఠశాలల ఏర్పాటు చేయనున్నది. భాగస్వామ్య పద్ధతిలో దేశవ్యాప్తంగా వంద కొత్త సైనిక్‌ పాఠశాలను ఏర్పాటు చేయాలనే ఉద్ధేశ్యంతో మొదటి దశలో భాగంగా 21 పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఉన్న సైనిక్‌ పాఠశాలలకు ఇవి భిన్నంగా ఉంటాయని రక్షణ శాఖ తెలిపింది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు సాయుధ దళాలలో చేరడం, మెరుగైన ఉద్యోగ అవకాశాలను అందిచడమే వీటి లక్ష్యంగా ఏర్పాటు చేయనున్నారు.

ఈ 21 పాఠశాలలల్లో 17 బ్రౌన్‌ ఫీల్డ్‌ నడుస్తున్న పాఠశాలలు కాగా, నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ పాఠశాలలు ఉన్నాయి. వీటిలోనూ 12 పాఠశాలలు ఎన్జీవోలు, ట్రస్ట్‌లు, సొసైటీలకు చెందినవి ఉండగా, 6 ప్రైవేట్‌ పాఠశాలలు, మూడు రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలలు ఉన్నాయి. డే అండ్‌ రెసిడెన్షియల్‌ వసతులతో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇవి ఎడ్యుకేషన్‌ బోర్డుకు అనుబంధం కాకుండా సైనిక్‌ స్కూల్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ప్రవేశాలు, నిబంధనలు తదితర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement