Sunday, April 28, 2024

Big Story: జూన్‌ 2న రైతులకు మరో వరం, ఇకపై ఏటా రెండు దశల్లో రైతు వద్దకే అధికారులు

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు సీఎం కేసీఆర్‌ రైతాంగానికి మరో శుభవార్తను అందించేందుకు సమాయత్తమవుతున్నారు. దేశంలోనే రైతుల అభ్యున్నతిని ఆకాంక్షిస్తున్న సీఎం కేసీఆర్‌ తెలంగాణలో మరిన్ని రైతు సంక్షేమ చర్యలతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసేలా అడుగులు వేస్తున్నారు. దేశంలోనే రైతు సంక్షేమ సర్కార్‌గా పేరున్న తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మక పథకం దిశగా కార్యాచరణ చేస్తున్నది. వ్యవసాయానికి నూతన జవసత్వాలు అందించేలా సీఎం కేసీఆర్‌ కార్యాచరణ చేస్తున్నారు.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో వ్యవసాయాన్ని రైతుబంధు వంటి ఆర్ధిక సాయం పథకంతో పండుగ చేసిన సీఎం కేసీఆర్‌ త్వరలో వ్యవసాయాన్ని గ్విగుణీకృతం చేసేలా ఈ శాఖ యంత్రాంగాన్ని సర్వం ప్రజల ముంగిటకు చేర్చేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. మరింత మెరుగైన విధానంతో రైతులకు అండగా నిల్చేలా విస్తృత లక్ష్యాలతో సరికొత్త పథకం సిద్ధమవుతున్నది. భూసార పరీక్షలు, ఎరువులు, విత్తనాలు, మార్కెటింగ్‌ వంటి వాటిపై పూర్తిగా రైతుకు సహకరించేలా కొత్త పథకం రూపొందుతోంది. తగిన పంటల సాగు, నీటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేందుకు, చేపల పెంపకంతోపాటు, ఇతర ప్రత్యామ్నాయాలపై మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు. ఇకమీదట ఇందుకు ప్రత్యేకంగా ఏటా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా పంట పొలాల భూసార పరీక్షలు, విత్తనాలు మొదలుకొని పంట చేతికొచ్చిన తర్వాత వాటి మార్కెటింగ్‌, కనీస మద్ధతు ధర అందించేలా చూడటం, ఇతరత్రా ఆర్ధిక సాయం అందజేత వంటి లక్ష్యాలతో మార్గదర్శకాలు రూపొందిస్తున్నది.

ఈ కార్యక్రమాన్ని ఎప్పటినుంచి అమలు చేయాలనే అంశాన్ని సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. దీనిపై త్వరలో కీలక నిర్ణయం ప్రకటించేందుకు సన్నద్ధమైన ఆయన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంనాడు అధికారికంగా ప్రకటించనున్నారని తెలిసింది. ఇందుకుగానూ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించనున్నారని సమాచారం. తద్వారా ప్రతీయేటా ఇకపై యాసంగి, వానాకాలం సీజన్‌లో రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో గ్రామాల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో రైతులతో మమేకం కానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయానిక చెందిన పలు అంశాలను ఎజెండాగా పేర్కొని రైతులకు వివరించనున్నారు. రైతులకు సాగునీరు, విద్యుత్‌ సరఫరా, పంటల తీరు, ఏ భూమిలో ఏ పంట వేయాలి…ప్రత్యామ్నాయ పంటల విధానం, పురుగు మందుల వాడకం, విత్తనాల సమకూర్పు వంటి అనేక అంశాలపై రైతులతో సంప్రదింపులు చేయనున్నారు. ఈ సమావేశాల్లో వ్యవసాయానికి సంబంధం ఉన్న పలు శాఖలు భాగస్వామ్యం కానున్నాయి.

ప్రధానంగా భూసార పరీక్షల నిర్వహణ, విత్తనాల అంచనా, డిమాండ్‌కు తగ్గట్లుగా విత్తనాల ఉత్పత్తి, వ్యవసాయ యాంత్రీకరణ, రుణాల అందజేత, ఇతర పంట సాయాలు, మార్కెటింగ్‌, నిల్వ సామర్ధ్యం, సౌకర్యాల కల్పనపై క్షేత్రస్థాయిలో రైతులతో చర్చించనున్నారు. ఇందులో వ్యవసాయ, ఇరిగేషన్‌, విద్యుత్‌, రెవెన్యూ, ఉద్యానవన, పాడిపరిశ్రమ వంటి శాఖలు పాల్గొననున్నాయి. ఈ కార్యాచరణను గత తరహాలో సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా వేగంగా పనులు జరిగేలా చూస్తారు. ఇందుకు సాంకేతికను వినియోగించనున్నారు. గ్రామాల్లో మొబైల్‌ టెస్టింగ్‌ సెంటర్లతో భూసార పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా దుక్కి ఎప్పుడు దున్నాలి. ఏ భూమిలో ఎంత విత్తనం వేయాలి. వానలు కురిసే అవకాశాలు ఎలా ఉన్నాయి..ఏ పంటకు ఎంత ధర ఉంది..ఏ పంట వేస్తే రైతుకు మార్కెట్‌ వెసులుబాటు ఉంది. ప్రభుత్వం ఎంతమేర సాయం చేయనుంది వంటి అన్ని అంశాలను ముందే వివరించనున్నారు. వ్యవసాయ క్యాలెండర్‌ను ప్రకటించి షెడ్యూల్‌ ప్రకారమే రైతులు ముందుకు వెళ్లేలా పలు సూచనలు, సలహాలు, ఇతర సాయాలు ఈ వేదికద్వారానే అందించనున్నారు.

కల్తీ విత్తనాలు కొని రైతులు నష్టపోకుండా ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తారు. ఇందుకు గుర్తింపు పొందిన విత్తనాల జాబితా రైతులకు అందిస్తారు. కల్తీ విత్తనాలతో కలిగే దుష్పరిణామాలను వివరించి, విక్రేతలపై తీసుకునే చర్యలను కూడా క్షేత్రస్థాయిలో వెల్లడిస్తారు. ఫలితంగా రైతులకు నష్టం తగ్గుతుందని ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. వ్యవసాయ యంత్రాలు, ఇతర పనిముట్లపై రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను కరపత్రాల రూపంలో అందించనున్నారు. దీంతో యాంత్రీకరణ దిశగా చైతన్యం పెరుగుతుందని, సకాలంలో పనులు జరిగి రైతుకు మరింత లాభాలు వస్తాయని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు సాయం అందజేతలో రైతులకు అవగాహన పెంచి, కొత్తగా భూములు కొనుగోలు చేసినవారికి, గతంలో భూములు ఉండి రైతుబంధు అందుకోలేకపోతున్న వారికి అవగాహన కల్పించి ఆ దిశగా సమాచారం అందిస్తారు. రైతుబీమా, బ్యాంకు రుణాలు, పంట పెట్టుబడి సాయం, క్రాప్‌ లోన్లు, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులపై పూర్తిగా ప్రచారం నిర్వహించనున్నారు. పంటల ఉత్పత్తులకు మార్కెట్‌లో ఉన్న ధరలను వెల్లడించి, మార్కెట్‌ సదుపాయాలను తెలియజేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement