Thursday, April 25, 2024

కొండగట్టు అంజన్న క్షేత్రంలో చోరీ … తు తూ మంత్రంగా చర్యలు

కొండగట్టు అంజన్న క్షేత్రం లో జరిగి చోరీ కేసు సంఘటనలో నామ మాత్రపు చర్యలు తీసుకున్నారు. చోరీ కేసుపై సమగ్రంగా దర్యాప్తు చేయకుండా తు తూ మంత్రంగా నైట్ వాచ్ మెన్ శంకర్ ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారు. దేవాలయ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ కి మెమో ఇచ్చారు. పోలీసులు ఈ సంఘటనను చాలంజ్ గా తీసుకొని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మూడు బృందాలు కర్ణాటక రాష్ట్రం భీసర్ లో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. సాంకేతిక పరిఘ్యనం తో గాలింపు లు ముమ్మరం చేశారు.


జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట పరిధిలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దొంగలు పడి వెండి వస్తువులు దోచుకు పోయారు. శుక్రవారం వేకువజామున 5 గంటలకు సుప్రభాత సేవకు ముందు ఆలయ ఉద్యోగి శ్రీనివాస్‌ గుడిలోకి వెళ్లగా.. తాళాలు తీసి ఉండటం గమనించాడు. నైట్‌ వాచ్‌మన్‌ శంకర్‌ను పిలిచి అడగగా.. తాను తాళాలు తీయలేదని చెప్పాడు. దీంతో శ్రీనివాస్‌ ఈవో, అర్చకులకు సమాచారం అందించాడు. ఈవో సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. నిందితుల వేలిముద్రలు, ఇతర వివరాలను సేకరించారు. ఆలయం వెనక వైపు చీకటిగా ఉండటంతో ముగ్గురు వ్యక్తులు భక్తుల మాదిరిగా కాషాయ రంగు వస్త్రాన్ని ముసుగుగా వేసుకొని వెనుక గేట్‌ వద్దకు వచ్చి తాళం పగలగొట్టారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దాని ప్రకారం అర్ధరాత్రి 1.18 గంటలకు లోపలికి వచ్చారు. ప్రధాన ఆలయ తాళాన్ని విరగ్గొట్టి గర్భగుడిలోకి చొరబడ్డారు. అర్థమండపంలో వెండి తొడుగును లాగేశారు. మరొకదాన్ని తీయబోగా అది రాలేదు. అనంతరం స్వామి వారి మూలవిరాట్టుకు వెనక ఉన్న 200 ఏళ్ల నాటి వెండి మకరతోరణం, స్వామి వారి ఎడమవైపు ఛాతీపై గల రామరక్ష, కిరీటం, గొడుగు, రెండు శఠగోపాలను, ఆలయం ముందున్న స్వామి వారి వెండి కవచాన్ని దొంగిలించారు. పక్కనే ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో రెండు శఠగోపాలను ఎత్తుకెళ్లారు. రూ.9 లక్షల విలువ చేసే 15 కిలోల వెండి వస్తువులు చోరీ అయినట్టు దేవస్థానం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ముమ్మరం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement