Friday, May 10, 2024

నిజామాబాద్‌కు మోదీ రాక.. జనసమీకరణలో బీజేపీ నేతలు

ఉత్తర తెలంగాణ, ప్రభన్యూస్‌ బ్యూరో : తెలంగాణలో ఎన్నికల శంఖారావం మోగిస్తూ ప్రధాని మోడీ భారీ బహిరంగలో నేడు మంగళవారం పాల్గొననున్నారు. ఎన్నికలు సమీపించే నేపథ్యంలో మోడీ నిజామాబాద్‌ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. భారీగా నిధులతో అభివృద్ధి పనులకు పునాది వేస్తూ ప్రజలకు ఈ వేదిక ద్వారా మోడీ ఎన్నికల పిలుపునివ్వనున్నారు. ఈసారి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకుంది. ఇందులో భాగంగానే అనేక దశాబ్దాల రైతుల ఎదురుచూపు, ఏకైక డిమాండ్‌ పసుపు ప్రత్యేక బోర్డు ఏర్పాటుపై కీలక ప్రకటన చేసిన మోడీ నిజామాబాద్‌లో శంకుస్థాపన చేయనున్నారు.

ఇక్కడే రెండు వేదికలు ఏర్పాటు చేయగా, ఒక వేదికపై రాజకీయ, మరో వేదికపై అధికారిక ప్రసంగాలు చేసే అవకాశం వుందని తెలుస్తోంది. నిజామాబాద్‌లో జరిగే మోడీ సభను ధన్యవాద్‌ సభగా జరపనున్నారు. పాలమూరు వేదికగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు మోడీ ప్రకటించటంతో ఈ సభకు పెద్ద ఎత్తున జనాన్ని తరలించాలని పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. ప్రధాని పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

నిజామాబాద్‌ పర్యటన సందర్భంగా మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీంతో ఆయా శాఖలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసారు. అలాగే గిరిరాజ్‌ కళాశాల మైదానంలో లక్ష మందితో బీజేపీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టింది. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఏడు నియోజకవర్గాలతో పాటు కామారెడ్డి, నిర్మల్‌, జగిత్యాల జిల్లాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు. ప్రధాని రాక సందర్భంగా ఏర్పాట్లను నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

రూ.8 వేల కోట్ల పనులకు శంకుస్థాపన

- Advertisement -

నిజామాబాద్‌ పర్యటనలో భాగంగా రూ. 8,021కోట్ల విలువైన ప్రాజక్టులను మోడీ ప్రారంబించనున్నారు. ఎన్టీపీసీలో నూతంగా నిర్మించిన 800 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టును తెలంగాణ ప్రజలకు మోడీ అంకితం చేస్తారు. 800 మెగావాట్లలో 680 మెగావాట్ల విద్యుత్‌ తెలంగాణ వినియోగించుకుంటు-ంది. నిజామాబాద్‌ పర్యటనలో భాగంగా పవర్‌, హెల్త్‌, రైల్వే ప్రాజక్టులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

రూ.1,369కోట్లతో నిర్మించిన హెల్త్‌ సెంటర్స్‌కు మోడీ భూమిపూజ చేస్తారు. ఇందూరులో హెల్త్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు, రూ.1,300 కోట్లతో 493 బస్తీ దవాఖానలు, క్రిటికల్‌ కేర్‌ సెంటర్లను ప్రధాని ప్రారంభించనున్నారు. 20 జిల్లా కేంద్రాల్లో ఉన్న 50 పడకల ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ బ్లాకులను నిర్మించనునున్నారు.

అలాగే రూ.305 కోట్లతో 340 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పూర్తయిన లైన్లను మోడీ ప్రారంభించనున్నారు. రెండు రోజుల నుండే మోడీ సభ జరిగే గిరిరాజ్‌ మైదానాన్ని కేంద్ర పోలీసు బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సభలో మీడియాకు అనుమతి ఇచ్చిన భద్రతా బలగాలు అధికారిక కార్యక్రమాలకు మాత్రం అనుమతివ్వలేదు.

ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమావేశం

ప్రధాని మోడీ నిజామాబాద్‌ పర్యటన ఏర్పాట్లపై సీఎస్‌ శాంతి కుమారి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రామగుండం ఎన్‌టీపీసీ 800 మెగావాట్ల ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. బ్లూ బుక్‌ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. అగ్నిమాపక, ఆరోగ్య, విద్యుత్‌, రోడ్లు భవనాలు తదితర శాఖలు కూడా విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

నిజామాబాద్‌ గిరిరాజ్‌ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభకు నిజామాబాద్‌ కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, సీపీ సత్యనారాయణ సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. నేడు మంగళవారం రోజున మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండున్నర గంటల పాటు ప్రధాని ఇక్కడే ఉండనున్నారు. అందుకనుగుణంగా పర్యటన ఏర్పాట్లు చేశారు.

ప్రధాని పాల్గొనే కార్యక్రమాల కోసం రెండు వేదికలు ఏర్పాటు చేశారు. తెలంగాణకు రహదారులు, ఎరువులు, కరెంట్‌ సమస్యలు తీరుస్తున్న ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే బీఆర్‌ఎస్‌ నేతలు స్థాయి మరచి మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అయితే నగరం పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement