Monday, April 29, 2024

ఇంటర్ ఫలితాలు రిలీజ్.. నిజామాబాద్ జిల్లాలో 60 శాతం ఉత్తీర్ణత..

ఉమ్మడి నిజామాబాద్, ప్రభ న్యూస్ బ్యూరో : 2022-23 విద్యా సంవత్సరానికి గాను నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా మొదటి సంవత్సరంలో 58% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ రఘురాజ్ తెలియజేశారు. రెండవ సంవత్సరం మొత్తం 14,086 మంది విద్యార్థులకు గాను 8,561 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 6,391 మందికి గాను 3,284 మంది విద్యార్థులు పాస్ కాగా 51 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 7,695 మంది పరీక్షలకు హాజరు కాగా 5,277 మంది విద్యార్థినిలు పాస్ అయి 68% ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా రెండవ సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణతలు 15వ ర్యాంకును పొందారు. అలాగే మొదటి సంవత్సరం విద్యార్థులు 15,315 మంది పరీక్షలకు హాజరు కాగా 7,782 మంది విద్యార్థులు ఉత్తీర్ణత తో 51% సాధించి రాష్ట్రంలో 16వ ర్యాంకును పొందారు. వీరిలో బాలురు 7000 మంది పరీక్షలకు హాజరు కాగా 2,966 మంది బాలురు పాసై 42% ఉత్తీర్ణత సాధించారు.

కాగా బాలికలు 8,215 మంది పరీక్షలకు హాజరు కాగా 4,816 మంది పాసయి 58 శాతం ఉత్తీర్ణత సాధించారు. నిజామాబాద్ జిల్లాలో 2021-22 సంవత్సరం ఫలితాలలో రెండవ సంవత్సర విద్యార్థులు 65% ఉత్తీర్ణత సాధించగా ఈసారి 60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అలాగే మొదటి సంవత్సరంలో 2021-22 విద్యా సంవత్సరానికి గాను 58 మంది శాతం ఉత్తీర్ణత సాధించగా ప్రస్తుతం 51 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ రఘురాజ్ మాట్లాడుతూ.. పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులు మానసికంగా క్రుంగి పోరాదని తెలియజేస్తూ వెంటనే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని సూచించారు. విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టయితే వారి తల్లిదండ్రులు కోపగించుకోరాదని టెలి మానస్ ను సంప్రదించవచ్చని వారికి కౌన్సిలింగ్ ఇస్తారని తెలియజేశారు.లేదా 14416 టోల్ ఫ్రీ నంబర్ కూడా సంప్రదించవచ్చని జిల్లా ఇంటర్ విద్య అధికారి తెలియజేశారు. పరీక్షల ఫలితాలలో ఏవైనా తప్పులు దొర్లినట్టయితే ఇంటర్మీడియట్ హెల్ప్ డెస్క్ ను [email protected] సంప్రదించవచ్చని తెలియజేశారు. కాగా విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షలకు ఈ నెల 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు పరీక్ష ఫీజులను ఆయా కళాశాలలో చెల్లించాలని తెలియజేశారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 4వ తేదీ నుండి ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రస్తుతం పరీక్షలలో రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోరుతున్న విద్యార్థులు రీకౌంటింగ్ కు 100 రూపాయలు, రీకౌంటింగ్ మరియు పరీక్ష జవాబు పత్రాల జిరాక్స్ కాపీలను పొందడానికి 600 రూపాయలను ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు. ఈ అవకాశం ఈనెల 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement