Thursday, April 25, 2024

NZB: సీఎం రేవంత్ రెడ్డి పై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోం…

నిజామాబాద్, మార్చి 27 (ప్రభ న్యూస్): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోమని టీపీసీసి ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హందన్, మాజీ అధికార ప్రతినిధి విద్యా సాగర్ హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేసిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావుపై బుధవారం నిజామాబాద్ నగరంలోని 1వ టౌన్ లో చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హందన్, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి విద్యా సాగర్ ఫిర్యాదు చేశారు.

ఈసందర్భంగా తాహేర్ బిన్ హందన్ మాట్లాడుతూ… మంగళవారం బి.ఆర్.ఎస్. భవన్, హైదరాబాద్ లో జరిగిన సికింద్రాబాద్ లోకసభ నియోజకవర్గ సమావేశంలో బి.ఆర్.ఎస్.వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు మాట్లాడుతూ మున్సిపల్ శాఖను తన వద్దనే ఉంచుకున్న సి.ఎం.రేవంత్ రెడ్డి మూడు నెలలుగా డబ్బులు ఇస్తేనే బిల్డింగ్ లకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. అలా వసులు చేసిన రూ.2,500 కోట్లను ఢిల్లీకి పంపించారని…. ఓవైపు ఇసుక దందా, రైస్ మిల్లర్లను మరో వైపు బిల్డర్లు రియల్టర్లను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని… కత్తెర పెట్టుకొని జేబు దొంగలా తిరుగుతున్నారు” అంటూ సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అభూతకల్పనలతో కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయాలనే దురుద్దేశ్యంతో ఇలా లేనివి ఉన్నట్లు బహిరంగంగా ఆరోపించడం ఏమిటని ప్రశ్నించారు. రైస్ మిల్లర్లు, ఇసుక దందా, బిల్డర్లను, రియల్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఊహా జనితమైన విధంగా బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చాలా ప్రమాదకరమని మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలపై వెంటనే విచారణ చేపట్టి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తప్పుడు ఆరోపణలు చేసిన అతని పై చట్టపరంగా తగిన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంతరెడ్డి విజయ్ పాల్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement