Friday, April 26, 2024

సాగ‌ర్ ఎన్నిక‌ల‌లో కెసిఆర్ ప్లాన్ – జ‌గ‌దీష్ రెడ్డి యాక్ష‌న్..

ఎప్పటికప్పుడు ఇన్‌చార్జీలకు దిశానిర్దేశం
ఉపఎన్నికల్లో గెలుపు వ్యూహాలతో ముందుకు
క్షేత్రస్థాయి పర్యటనలతో హోరెత్తిస్తున్న ప్రచారం
కేడర్‌లో నూతనోత్తేజం జానా చేసిందేమీ లేదు
అభివద్ధి అంతా టీఆర్‌ఎస్‌ పాలనలోనే
కాంగ్రెస్‌, బీజేపీలపై జగదీష్‌ రెడ్డి విమర్శలు

ఉమ్మడి నల్గొండ, : సాగర్‌ ఉపసమరం హోరెత్తిపోతోంది.. ప్రధానపార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది.. అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.. ఉపసంహరణల గడువు ముంచుకొచ్చింది. ఎన్నికల పోలింగ్‌కు 15రోజులు మాత్రమే గడువుంది. అయితే ఉపసమరంలో అధికార టీఆర్‌ఎస్‌ గెలుపు బాధ్యతలు మంత్రి జగదీష్‌ రెడ్డి భుజాన వేసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఆయన సాగర్‌ ఎన్నికల్లో కూడా అన్నీ తానై నడిపిస్తున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చే ఆదేశాలు అమలు చేస్తున్నాడు. ఇప్పటికే నియోజక వర్గంలోని మండలాలకు ఎమ్మెల్యేలకు ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వడంతో వారందరిని ముందుకు నడిపిస్తున్నాడు. అధిష్టానం నుండి వచ్చే ఆదేశాలు అమలు చేయడం.. ఎప్పటికప్పుడు పరిస్థితులను గుర్తించి సీఎం కేసీఆర్‌తో మంత్రి జగదీష్‌ చర్చించి పరిష్కార మార్గాలు చూపుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం చేపట్టిన, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై వివరిస్తున్నారు. గ్రామాలవారీగా ప్రభుత్వంతో లబ్ధిపొందిన వారిని కలుస్తూ కేసీఆర్‌తోనే సాధ్యమైందని వారికి నచ్చచెపుతున్నారు. మండలాలకు నియమించిన ఇన్‌చార్జిలు ఎలా చేయాలనే అంశంపై కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. అనుముల, త్రిపురారం, నిడమ నూరు, పెద్దవూర, గుర్రంపోడు, తిరుమలగిరి(సాగర్‌), మాడుగులపల్లి మండలాలతో పాటు- నందికొండ, హాలియా మునిసిపాలిటీ-ల్లో పరిస్థితులను గమనిస్తూ ముందుకు సాగేలా మంత్రి వ్యూహాలు రచిస్తున్నారు. ఆయా మండలాలు, పురపాలికలకు ఇన్‌చార్జిలను నియమించడం తో వారితో సమన్వయం చేసుకుంటూ గెలుపు బాటలో పయనింప చేస్తున్నారు. ఇవ్వన్నీ ఇలా ఉంటే క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నుండి చేరికలకు ప్రాధాన్యమిస్తూ వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. సాగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు జానారెడ్డి బలమైన వారు కావడంతో ఆ పార్టీ కేడర్‌ను తమ వైపునకు తెచ్చుకొని ప్రత్యర్థులను బలహీనపరుస్తూ వ్యూహాత్మక ఎత్తుగడలతో ఉపఎన్నికలను ఎదుర్కొంటున్నారు.
సాగర్‌ అభ్యర్థి నోముల భగత్‌ గెలుపు బాధ్యతలు మోస్తున్న మంత్రి తెర వెనుక, తెర ముందు అన్ని వ్యవహారాల్లో కీలకంగా పనిచేస్తున్నారు. ప్రచారంలో కొత్త ఎత్తిగడలతో పోతున్నారు. జానారెడ్డిని ప్రచారంలోనే దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీలపై మంత్రి జగదీష్‌ రెడ్డి విరుచుకు పడుతున్నారు. 60ఏళ్లలో ఏమి చేయలేని జానారెడ్డి మళ్ళీ ఎన్నికల్లో పోటీ- చేయడం ప్రజలను మోసగించడమేనని చెపుతున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో అభివృద్ధిలో పయనింపచేస్తున్నారని చెప్పుకొచ్చా రు. ఇవన్నీ ఇలా ఉంటే టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఇప్పటి వరకు పనిచేయని వారి మాటలు పట్టించుకోవద్దని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సిట్టింగ్‌ స్థానాన్ని దక్కించు కోవడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతోంది. ఈ బాధ్యతలు భుజాన వేసుకున్న మంత్రి జగదీష్‌ ఆయనదైన శైలిలో గెలుపునకు బాటలు వేస్తూ వ్యూహాలతో ముందుకు పోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement