Saturday, June 22, 2024

అనంతగిరిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ… పారిశుధ్య పనులపై ఆరా

అనంతగిరి, జులై 25 (ప్రభ న్యూస్) : అనంతగిరి మండలంలో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న ఆయన కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం మండల వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి ఎంపీడీవో విజయశ్రీ ని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తీవ్ర వర్షాలు దృష్ట్యా పాలేరు వాగు అనుకుని ఉన్న గ్రామాలతో పాటు, కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని సంబంధిత ఎమ్మార్వో సంతోష్ కిరణకు ఆదేశించారు. అనంతరం శిధిలావస్థలో ఉన్న అనంతగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు.

పాఠశాల శిధిలావస్థలో ఉందని, వర్షం వస్తే చాలా ఇబ్బంది అవుతుందని గ్రామ సర్పంచ్ వేనేపల్లి వెంకటేశ్వరావు కలెక్టర్ కు తెలియజేశారు. తప్పనిసరిగా త్వరితగతిన పాఠశాల నిర్మాణం జరిపేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ కు కలెక్టర్ తెలియజేశారు. మండల వ్యాప్తంగా మన ఊరు – మనబడి ప్రణాళిక పనులు జరుగుతున్న విధానాన్ని ఏఈ హర్షను అడిగి తెలుసుకున్నారు. గత కొంతకాలంగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, తక్షణమే తమ సమస్యలను పరిష్కరించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లాలని అనంతగిరి మండల పంచాయతీ కార్మికులు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఇదిలా ఉండగా కలెక్టర్ పర్యటన ఉందని తెలిసి కూడా వైద్యాధికారి రంజిత్ రెడ్డితోపాటు పలువురు అధికారులు హాజరు కాకపోవడంతో వారిపై కలెక్టర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కలెక్టర్ మాట్లాడుతూ… ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఉద్యోగులు టైం ప్రకారం విధులకు హాజరుకావాలని, ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులను పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సమయ పాలన పాటించి విధులకు హాజరుకావాలని, లేదంటే చర్యలు తప్పవని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement