Thursday, May 16, 2024

తెలంగాణపై కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌ రావు

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, కేంద్రం ప్రారంభించిన ఎయిమ్స్‌లో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి లేదని మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. చౌటుప్పల్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. 2018లో యాదాద్రి జిల్లాకు ఎయిమ్స్‌ను కేటాయిస్తే నాలుగేళ్ల తర్వాత మోదీ వచ్చి శంకుస్థాపన చేశారని, ఒక్క ఎయిమ్స్‌ కేటాయించినందుకే బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 8 వైద్య కళశాలలు ప్రారంభించిందని గుర్తు చేశారు. చేతలు తక్కువ.. ప్రచారం ఎక్కువ అన్నట్లుగా బీజేపీ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఎయిమ్స్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల భూమిని కేటాయించిందని పేర్కొన్నారు. వైద్యరంగంలో తెలంగాణ అద్భుతాలు సృష్టిస్తోందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరును నీతిఆయోగ్‌ కూడా ప్రశంసించిందని తెలిపారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. ఫ్లోరైడ్‌ బాధితులకు ఉచితంగా డయాలసిస్‌ సేవలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 102 డయాలసిస్‌ సెంటర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఫ్లోరైడ్‌ను తరిమేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ప్రశంసించారు. ఈ నెలలోనే న్యూట్రీషియన్‌ కిట్‌ పథకాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు. సూర్యాపేట, నల్లగొండలో నర్సింగ్‌ కాలేజ్‌, పారా మెడికల్‌ కాలేజీ మంజూరు చేశామన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో వైద్య విద్య బలోపేతమైందని మంత్రి హరీశ్‌ రావు పునరుద్ఘాటించారు. క్యాన్సర్‌ రోగుల కోసం కీమోథెరపీ సేవలు ప్రారంభించబోతున్నామని చెప్పారు. ఎల్బీనగర్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించబోతున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఒక్క ఏడాదిలో 10వేల పడకలు అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు. వరంగల్‌ హెల్త్‌ సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. డిసెంబర్‌ నాటికి వరంగల్‌ హెల్త్‌ సిటీ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దేశానికే తెలంగాణ మోడల్‌గా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తోందని.. ఇదే కాంగ్రెస్‌ పాలనకు బీఆర్‌ఎస్‌ పాలనకు తేడా అని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement