Monday, May 6, 2024

Big Story: ఎనిమిదేళ్లలో మూడు రెట్లకు పైగా.. భారీ రాబడిలో రియల్‌ రంగం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో స్థిరాస్తి లావాదేవీలు ఊపందుకున్నాయి. ఇండ్ల స్థలాలు, ఇళ్లు, అపార్ట్‌ మెంట్ల ఫ్లాట్ల విక్రయాలు భారీగా పురోగమిస్తున్నాయి. 2022-23 ఆర్ధిక ఏడాదిలో ఇప్పటికే రూ. 4748కోట్ల వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల రాడితో 501035 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంటే దాదాపుగా రూ. 50వేల కోట్ల స్థిరాస్తుల క్రయవిక్రయాలు నమోదయ్యాయని రిజిస్ట్రేషన్ల శాఖ చెబుతోంది. గడచిన ఎనిమిదేళ్లలో ఈ సంఖ్య మూడింతలకు చేరిందని అంచనా. హెచ్‌ఎండీఏ పరిధిలో క్రయవిక్రయాలు తొలి స్థానంలో ఉండగా రాష్ట్రమంతటా ఇదే ఊపు కనిపిస్తోంది.

ఈ రంగంలో 80శాతంపైగా రాబడి జీహెచ్‌ఎంసీ పరిధినుంచే సమకూరుతోంది. గతేడాది 8లక్షల ప్లాట్లు, ఇండ్లు, ఫ్లాట్ల విక్రయాలు జకరగ్గా, వీటి విలువ 1.05లక్షల కోట్లుగా నిర్దారించారు. దీంతో సర్కార్‌కు రూ. 7560కోట్ల రాబడి ఖజానాకు చేరింది. 2020-21లో కరోనా కారణంగా రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగినప్పటికీ గడచిన ఏడాదిగా పుంజుకుంటున్నాయి. గతేడాది 72వేల కోట్లు ప్రభుత్వ మార్కెట్‌ విలువకాగా, కొంత ఎక్కువ మొత్తంలో అంటే రూ. 1లక్ష కోట్లకు మించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు.

హెచ్‌ఎండీఏ పరిధిలో క్రయవిక్రయాలు ఇలా…

ఏడాది రిజిస్ట్రేషన్లు రాబడి
2016-17 244158 2228
2017-18 295085 3002
2018-19 413349 3786
2019-20 390738 3944
2020-21 224533 2825
2021-22 407227 6759

సర్కార్‌ నిర్దేశించిన మార్కెట్‌ విలువకంటే ఎక్కువ మొత్తంతో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న తీరు రిజిస్ట్రేషన్‌ శాఖలో నెలకొంది. నిర్ధేశిత మార్కెట్‌ విలువలను మించి ఎక్కువ మొత్తానికి ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్న పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతోంది. గత ఆర్ధిక ఏడాదిలో మొత్తం రిజిస్ట్రేషన్లలో 40శాతం ఇలా నిర్ధేశిత విలువకంటే ఎక్కువ చూపుతూ దస్తావేజులను రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. రూ. 6500 కోట్ల రాబడి అంచనా వేయగా, రూ. 7560 కోట్ల ఆదాయం సమకూరింది. అంటే మార్కెట్‌ విలువకంటే రూ. 2060 కోట్లు ఎక్కువ ఆదాయం వచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాలు, పాత జిల్లాల హెడ్‌ క్వార్టర్లలో భూముల విలువ నాలుగైదింతలు పెరిగింది.

- Advertisement -

గతేడాది రెండు దశల్లో మార్కెట్‌ విలువలను సవరించినప్పటికీ బహిరంగ మార్కెట్‌ ధరకంటే ఎక్కువ మొత్తాలకు రిజిస్ట్రేషన్లు పెరుగుదల సంతరించుకోవడం విశేషం. ఈ ఏడాది కూడా రూ. 4748కోట్లలో రూ. 500కోట్లు ఇలా ఎక్కువ మొత్తంలో వచ్చిన ఆదాయమే ఉన్నట్లు సమాచారం. నూతన జిల్లాల్లో ప్రభుత్వం తాజాగా సమీకృత కలెక్టరేట్లను ప్రారంభించింది. కొత్త జిల్లాల పరిధిలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. రవాణా సౌకర్యాలు మొదలుకొని అన్ని రకాల సదుపాయాలు విస్తృతమయ్యాయి. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లకు సమీపాల్లోని భూములు వాస్తవ ధర గజానికి రూ. 50వేలనుంచి రూ 1లక్షకు చేరాయి. గద్వాల, వరంగల్‌ అర్భన్‌ వంటి జిల్లాల్లో అప్పుడు ఎకరం భూమి ధర రూ. 25లక్షలుండగా తాజాగా రూ. 3కోట్లనుండి రూ. 4కోట్లు పలుకుతోంది.

ఇక కాళేశ్వ‌రం ప్రాజెక్టులో నీటి కళతో వ్యవసాయ భూములకు సిద్దిపేట, భూపాలపల్లి, కరీంనగర్‌, పెద్దపల్లి, యాదాఇ, సిరిసిల్ల, జగిత్యాల వంటి జిల్లాల్లో భూములకు అనూహ్య డిమాండ్‌ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబందు, రైతు బీమా సాయంవంటి వాటితో వ్యవసాయానికి పూర్వ వైభవం వస్తోంది. దీంతో భూముల ధరలు పెరగగా, వ్యాపారులు, ఎన్నారైలు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు తమ పెట్టుబడులను భూములపై పెడుతున్నారు. తమ పెట్టుబడి మొత్తాలకు ఆదాయపు పన్ను మినహాయింపు, వైట్‌ మనీగా చూపేందుకు మార్కెట్‌ విలువకంటే ఎక్కువ మొత్తానికి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. దీంతో సర్కార్‌ ఖజానాకు రాబడి అంచనాలకు మించి చేరుతోంది.

గతేడాదిగా ఆస్తుల కొనుగోళ్లలో పారదర్శకత పెరిగింది. నగదు చెల్లింపులు అంతా బ్యాంకులనుంచి జరుగుతుండటంతో రిజిస్ట్రేషన్‌ రుసుములు, స్టాంపు డ్యూటీ సక్రమంగా చెల్లిస్తున్నారు. మరోవైపు ఆస్తుల విలువలను వాస్తవంగా కొన్న రేటు ప్రకారం చూపేందుకు బ్యాంకు రుణాలు కూడా మరో కారణంగా మారాయి. కొనుగోలుదారు నేరుగా చెక్కులతో నగదు చెల్లింపులకు ప్రాధాన్యతనిస్తుండటంతో విక్రయదారు కూడా సదరు నగదుకు లెక్క చూపాల్సి వస్తోంది. కొనుగోలు చేసిన మొత్తాన్ని లెక్కలోకి చూపడంద్వారా కొందరు కొనుగోలుదారులు నల్లధనాన్ని వైట్‌ చేసుకుంటున్న పరిస్థితి పుంజుకుంటోంది. తెలంగాణ నూతన రాష్ట్ర అవతరణ, అనేక అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు, ఐటీ కంపెనీలు, జాతీయ రహదారులు, కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, పారిశ్రామిక ప్రగతి వంటి రాకతో భూములకు డిమాండ్‌ పెరిగింది. పట్టణాలు, నగరాలు, ఆయా మండల, జిల్లా కేంద్రాల్లో ప్లాట్లకు రెక్కలు వచ్చాయి. దీంతో వాస్తవ ధరకంటే దాదాపు నాలుగైదు రెట్లు ధరలు పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement