Monday, April 29, 2024

Ts | ఆగస్టు 16 నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు?..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: శాసనసభ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 16వ తేదీ నుంచి నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఎన్నికల వేళ కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది. శాసనసభ సమావేశాల నిర్వహ‌ణ తేదీల ఖరారుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో అందుబాటులో ఉన్న పలువురు మంత్రులతో సమావేశమై చర్చించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 12వతేదీతో ముగిశాయి.

ఈ సమావేశాలు పూర్తయిన ఆరు నెలలలోపు అంటే ఆగస్టు 11లోపు ఉభయసభలను సమావేశ పరచాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 10 తర్వాత అసెంబ్లిd, శాసనమండలిని సమావేశ పరచాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించినట్టు సమాచారం. కీలకమైన ఆరేడు బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింపు పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇతర కీలక అంశాలు ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

నవంబర్‌ లేదా డిసెంబర్‌ లో తెలంగాణ అసెంబ్లి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశాలను తమకు అనుకూలంగా మలుచుకుని విపక్ష పార్టీలను ఇరుకున పెట్టె అవకాశం కనిపిస్తోంది. ఉచిత విద్యుత్‌ ఫ్రై తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై కూడా భారాస ఈ సమావేశాల్లో ప్రస్తావనకు తీసుకువచ్చి కాంగ్రెస్‌ పార్టీని తూర్పార బట్టేందుకు రంగం సిద్ధం చేసినట్టు చెబుతుతున్నారు.

ఉచిత విద్యుత్‌ అంశం తమ పేటెంట్‌ అని ఈ ఆంశంపై మాట్లాడే అర్హత తమ పార్టీకే ఉందని కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు చేస్తున్న ప్రకటనలను ప్రస్తావించడంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పదేళ్ల వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలనలో విద్యుత్‌ రంగాన్ని ఏ విధంగా భ్రస్టు పట్టించారన్న అంశంపై సీఎం కేసీఆర్‌ శాసనసభలో పవర్‌ పాయుంటి ప్రెజెంటేషన్‌ ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీని ఇరుకున పెట్టె సూచనలు కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. విద్యుత్‌ రంగం అధోగతి పాలు కావడానికి కాంగ్రెస్‌ పార్టీ అవలంబించిన దగాకోరు విధానాలే కారణమని భారాస దుయ్యబడుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో విద్యుత్‌ రంగంపై కేసీఆర్‌ శాసనసభలో ఒక రోజంతా చర్చకు పెట్టె అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. అసెంబ్లి ఎన్నికలు సమీపిస్తుండడంతో శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్‌ కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అసెంబ్లి ఎన్నికల నోటిఫికేషన్‌ సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసే అవకాశం ఉంది. సహజంగానే ఎన్నికల ప్రభావం సమావేశాలపై పడనున్నట్టు చెబుతున్నారు.

రెండు, మూడు రోజుల్లో మంత్రి మండలి భేటీ

అసెంబ్లి, శాసనమండలి సమావేశాల తేదీలను ఖరారు చేయడంతో పాటు సమావేశాల ఎజెండా, ఏయే బిల్లులను సభ ముందుకు తీసుకు రావాలన్న అంశంపై చర్చించేందుకు రెండు మూడు రోజుల్లో మంత్రి మండలిని సమావేశ పరచాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్టు సమాచారం. మంత్రివర్గ సమావేశానికి సంబందించిన ఎజెండాను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కుండపోత వర్షంతో ప్రాజెక్టులన్నీ నిండిపోవడం గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అకాల వర్షానికి చెరువులకు గండ్లు పడి జనజీవనం స్తబించింది. ఆయా జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు స్థానికంగా మకాం వేసి సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వరదలు తగ్గుముఖం పట్టాక మంత్రి వర్గ భేటీని జరపాలని కేసీఆర్‌ నిర్ణయించారు. శాసనసభ, శాసనమండలి సమావేశాల తేదీ ఖరారు సహా పలు అంశాలపై మంత్రి మండలి సమావేశంలో చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement