Friday, May 3, 2024

HYD: నియంతృత్వ పోకడలతో మోడీ పాలన.. మల్లు భట్టి విక్ర‌మార్క‌..

నియంతృత్వ పోకడలతో నరేంద్రమోడీ పాలన కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పార్లమెంటులో విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఇండియా కూటమి చేపట్టిన ధర్నాలో మల్లు భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పార్లమెంట్‌లో జరిగిన ఘటనపై హోంమంత్రి అమిత్ షా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎంతోమంది త్యాగాల ఫలితం వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు.

కానీ ప్రస్తుతం దేశంలో అరాచక పాలన సాగుతోందన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైనా ఉందన్నారు. దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదని.. ప్రశ్నిస్తే అరెస్ట్‌లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన ప్రతివారినీ అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. పార్లమెంట్ భవనంలో దాడిపై వివరణ ఇవ్వాలని అడిగిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారన్నారు. పార్లమెంటును రక్షించలేని బీజేపీ.. దేశ రక్షణను పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు.

పార్లమెంట్ పై దాడి అంటే.. అంబేద్కర్ గుండెపై దాడి జరిగినట్టే… కూనంనేని
పార్లమెంట్ పైన దాడి జరగడం అంటే అంబేద్కర్ గుండెపై దాడి జరిగినట్టేనని.. ఈదాడికి కారణం ఎవరని ప్రధాని, హోంమంత్రిని అడిగితే హిట్లర్, ముస్సోలిని లా ప్రవర్తించారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ధర్న చౌక్ లో ఆయన మాట్లాడుతూ… ఎంపీలను సస్పెన్షన్ చేశారన్నారు. హిట్లర్, ముస్సోలీని లాగా మీరు జైలుకు వెళ్ళక తప్పదన్నారు. ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లో ప్రజా తీర్పుకు విరుద్ధంగా ఫలితం వచ్చిందన్నారు. ఆగంతకులకు పాస్ ఇచ్చింది బీజేపీ ఎంపీనే అని, ఆయనను ఏమైనా సస్పెండ్ చేసారా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఏమన్నారని సభ్యత్వం రద్దు చేశారని అన్నారు. తృణమూల్ ఎంపీ ప్రశ్నిస్తే సభ్యత్వం రద్దు చేస్తారా ? నరేంద్ర మోడీ తప్పులను ఎండగట్టడం కోసం కలిసి నడుద్దామన్నారు. సస్పెన్షన్ ను రద్దు చేయాలని, ఆగంతకుల దాడి మీద ప్రకటన చేయాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని మీరే ఈ కుట్ర చేసారా… తేలాలని కూనంనేని అన్నారు.

- Advertisement -


వచ్చే ఎన్నికల్లో మోడీ ఔట్.. కూటమి ఇన్..వి.హనుమంతరావు..
వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఓడిపోయి… ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు అన్నారు. ధర్నా చౌక్ లో ఆయన మాట్లాడుతూ… మణిపూర్ లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నా.. ఇంత వరకు ఏ ప్రకటన చేయలేదన్నారు. పార్లమెంట్ పై దాడి చేసిన ఆగంతకులకు పాస్ ఇచ్చింది బీజేపీ ఎంపీనే.. ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పార్లమెంట్ కే రక్షణ లేకుంటే.. ప్రజలకు రక్షణ ఎక్కడుంటుందన్నారు. 146మంది ఎంపీలు లేకుండా బిల్ పాస్ చేసుకుంటారా…? అధికారంలో ఉన్న వారు నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎంతో మంది ప్రధానులను చూసా.. మోడీ లాంటి వారిని చూడలేదన్నారు. ఎంపీలను సస్పెండ్ చేసి బ్రిటిష్ పరిపాలన లాగా చేస్తున్నారన్నారు. సేవ్ డెమోక్రసీ పేరుతో దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నిరసనలు తెలుపుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement