Friday, April 26, 2024

ఆ ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు పెంచాలి: ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి

పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. పట్ణణ స్థానిక సంస్థలపై మంగళవారం ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నింటినీ క్షేత్ర స్థాయిలో విజయవంతంగా చేపడుతున్న 3,618 మంది కౌన్సిలర్లు, కార్పోరేటర్లు, మున్సిపల్ చైర్మన్‌లు, మేయర్లుకు గౌరవ వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కోరారు.

రాష్ట్రంలోని 142 పట్టణ స్థానిక సంస్థల్లో దాదాపు కోటి 44 లక్షల జనాభా ఉందన్నారు. పట్టణ స్థానిక సంస్థలు ప్రగతి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ ఏడాది రూ.2,622 కోట్లను ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అదే విధంగా అర్బన్ లోకల్ బాడీల్లో సీసీ చార్జీలను రెగ్యులర్ గా కట్టుకోవడం, సానిటేషన్ వర్కర్లకు జీతాలు రెగ్యులర్ గా ఇవ్వడం, దాదాపు 2,300 కొత్త సానిటేషన్ వాహనాలను కొనుగోలు చేయడం, 38 లక్షల చెత్త బుట్టలను ఇంటింటికీ పంచడం, డంప్ యార్డులను ఏర్పాటు చేసుకోవడం, సీవరేజ్, మానవ వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

పబ్లిక్ టాయిలెట్స్ ను విరివిగా నిర్మించడం, వైకుంఠధామాలు, ఎల్ ఈడీ వీధి దీపాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ల ఏర్పాటు, జంతువుల సంరక్షణ కేంద్రాలు, ఓపెన్ జిమ్ లను సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎమ్మెల్సీ కవిత. వీటితో పాటు వీధి వ్యాపారులకు సైతం మంచి సౌకర్యాలు కల్పించాలని ప్రత్యేక కార్యక్రమాలు, పట్టణ హరిత హారంలో భాగంగా, నర్సరీలు, పట్టణ ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, మల్టి లెవెల్ అవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నామని మండలిలో ఎమ్మెల్సీ కవిత తెలియజేశారు. మున్సిపల్ బడ్జెట్ లో 10% గ్రీన్ బడ్జెట్ గా కేటాయించి, పట్టణాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement