Friday, May 3, 2024

కేసీఆర్ నిర్ణయాలతో పెరిగిన సాగు విస్తీర్ణం: మంత్రి వేముల

ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలం లక్కోర గ్రామం, భీంగల్ మండలం సికింద్రాపూర్ గ్రామాల్లో రూ.14 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మొత్తం 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల రెండు గోడౌన్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. రూ. 24 లక్షల వ్యయంతో నిర్మించిన సికింద్రాపూర్ పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించారు. తరగతి గదుల నిర్మాణానికి ముందుకు వచ్చిన స్థానిక ఎంపిటిసికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అట్లాగే ఏర్గట్ల మండల కేంద్రంలో రూ.7.5 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ.5లక్షల వ్యయంతో నిర్మించిన నాయీ బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్‌ను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న రైతు ప్రయోజన కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా సాగు నీరు, విరివిగా నిర్మించిన చెక్ డ్యాములు, చెరువులు పూడికతీత ద్వారా గ్రౌండ్ వాటర్ పెరిగి కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్న బోర్ల ద్వారా ఎకరం కూడా బీడు లేకుండా సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. రైతులకు ఎకరానికి 10వేల పెట్టుబడి సాయం, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, ఎక్కడికక్కడ పంట కొనుగోలు లాంటి ఎన్నో రకాల రైతు ప్రయోజన కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఆహార ధాన్యం పంట దిగుబడి గతంలో కంటే ఈ ఏడు సంవత్సరాల్లో ఐదు రెట్లు పెరిగిందని చెప్పారు. పండించిన ఆహార ధాన్యాలు ఎక్కడ నిల్వ చేసుకోవాలనే ఆలోచనలతో ముఖ్యమంత్రి కేసీఆర్ గొడౌన్స్ నిర్మిస్తున్నారని తెలిపారు.

బాల్కొండ నియోజకవర్గంలోని కిసాన్ నగర్ లో 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఒకే ఒక్క పాత గొడౌన్ ఉండేదన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే 11 కొత్త గొడౌన్స్ వచ్చాయన్నారు. ఇప్పటికే తొమ్మిది పూర్తయి వినియోగంలో ఉన్నాయని తెలిపారు. వీటి వల్ల 57 వేల 250 మెట్రిక్ టన్నుల పంట నిల్వ చేసుకోవచ్చని తెలిపారు. వేల్పూర్,మోర్తాడ్,కమ్మర్పల్లి, రెంజర్ల,భీంగల్, కిసాన్ నగర్, ఏర్గట్ల, బాల్కొండలో ఇప్పటికే గొడౌన్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు.గత ప్రభుత్వాల 60 ఏండ్ల హయాంలో నిర్మించింది కేవలం ఒక్క 5వేల మెట్రిక్ టన్నుల గొడౌన్ మాత్రమే అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 57 వేల మెట్రిక్ టన్నుల గొడౌన్స్ అందుబాటులోకి వచ్చాయని అని చెప్పారు. గోడౌన్లు మంజూరుచేసిన మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కి మంత్రి వేముల కృతజ్ఞతలు తెలిపారు. 

ఇది కూడా చదవండి: తెలంగాణలో ‘వరి’ వద్దంటే రైతుల వర్రీ…

Advertisement

తాజా వార్తలు

Advertisement