Friday, May 3, 2024

TS: సీఎం కేసీఆర్​ ప్రశ్నలతో మైండ్​ బ్లాక్​ అయ్యింది.. బండి సంజయ్​పై ఎమ్మెల్యే నన్నపునేని ఫైర్

బీజేపీ విధానాలను ప్రశ్నించి.. ఏం చేస్తే దేశం బాగుపడుతుందో వివరిస్తే.. సీఎం కేసీఆర్​ ప్రశ్నల‌కు సమాధానం చెప్పలేక వెకిలి నవ్వులు, చిల్లర మాటలు మాట్లాడుతున్న బండి సంజయ్​కి ప్రజలు త్వరలోనే బుద్ధిచెబుతార‌ని ఎమ్మెల్యే న‌న్నపునేని న‌రేంద‌ర్ అన్నారు. హన్మకొండలో ఇవ్వాల (సోమవారం) ప్రభుత్వ చీఫ్ విప్ ధాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుదారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజ్‌తో క‌లిసి ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

‘‘సీఎం కేసీఆర్ తన ప్రెస్ మీట్ లో దేశాన్ని ఆలోచింపజేశారు. బీజేపీ విధానాలను ఎండగట్టారు.. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని దేశ ప్రజలకు వివరించారు. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ తో బీజేపీ నేతల మైండ్ బ్లాక్ అయ్యింది. అందుకే వింత వింతగా మాట్లాడుతున్నారు. మోదీ ఉబ్బియ్యగానే బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పిచ్చి కూతలు కూస్తున్నాడు. అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాడు’’ అని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రజలకేమి చేశారో చెప్పమంటే.. పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు బండి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తున్నారు.. తెలివితక్కువ దద్దమ్మ, తంబాకు నోరు బండి సంజయ్’’ అని ఎద్దేవా చేశారు.

హిందువులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశారో ప్రజలకు బాగా తెలుసు.. తెలంగాణలో హిందువులకు టీఆర్ఎస్ ఏం చేసిందో, బీజేపీ ఏం చేసిందో చర్చకు సిద్ధమా? కరీంనగర్ లో నిన్ను చూసి ప్రజలు ఛీ కొడుతున్నారు.. దేశాన్ని ముంచుతూ, అప్పులు ఎగ్గొట్టి పోయినోళ్లను దేశం దాటించిన పార్టీ బీజేపీ”అని నరేందర్​ విమర్శలు గుప్పించారు. నాడు ఆజాంజాహి మిల్ ను కాంగ్రెస్​ ప్రభుత్వం నాశనం చేసింది.. ఇప్పుడు బీజేపీ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ని తరలించి అన్యాయం చేసిందని మండిపడ్డారు.

భారీ వర్షాల నేపథ్యంలో ‘కాకతీయ సప్తాహం’’ వాయిదా.. కాకతీయ ఉత్సవాలు ఘనంగా ప్రారంభించామని, కాకతీయ వారసుడిని తీసుకువచ్చి ఘనంగా వేడుకలు జరిపామని, కానీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలనుకున్న కాకతీయ సప్తాహం ఉత్సవాలను ప్రస్తుతం వాయిదా వేస్తున్నట్టు తెలిపారు ప్రభుత్వ చీఫ్​ విప్​ ధాస్యం వినయ్​భాస్కర్​, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్​.  మూడు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న బారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికలతో ఈ ఉత్సవాలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

గతంలో వరదలొస్తే మంత్రి కేటీఆర్ వచ్చి పరిస్థితిని పరిశీలించారని, అప్పుడే వరంగల్​కు వరదలు రాకుండా శాశ్వత పరిష్కారం కనుగొన్నట్టు వారు తెలిపారు. దీంతో వరంగల్ తూర్పులో 75 ఏండ్లలో ఎవరూ చేయని ప్రయత్నాన్ని 250 కోట్ల రూపాయలతో వరద నీటి కాలువల‌ నిర్మాణాన్ని చేపడుతున్నట్టు వివరించారు. అందులో భాగంగా శివనగర్ లో పనులు పూర్తయ్యాయని, మిగతా చోట్ల కూడా పనులు జరుగుతున్నట్టు తెలిపారు. దీంతో వరంగల్​ సిటీ ముంపున‌కు గురికాకుండా శాశ్వత పరిష్కారం లభించిందన్నారు.  

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement