Thursday, May 2, 2024

వైద్య వృత్తి ఎంతో పవిత్రమైంది.. డాక్టర్ అవ్వాలనేది మా అమ్మ కల.. మంత్రి కేటీఆర్

వైద్యవృత్తి ఎంతో పవిత్రమైందని అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో నిర్వహించిన ‘ఉమెన్ ఇన్ మెడిసిన్’ సదస్సుకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తన తల్లి కోరిక మేరకు మెడిసిన్ చదివి డాక్టర్ అవుదామని అనుకున్నానని… కానీ, తన తండ్రి, సీఎం కేసీఆర్ సూచనతో ఆ ఆలోచన విరమించుకొని, బయో టెక్నాలజీ వైపు వెళ్లానని కేటీఆర్ చెప్పారు. కష్టకాలంలో వైద్యులు పనిచేసే విధానం చూస్తే గర్వంగా ఉంటుందన్నారు. ఈ క్రమంలో వైద్య వృత్తిపై తన ఆసక్తిని వెల్లడించారు. తల్లి తనను డాక్టర్ గా చూడాలనుకుందని చెప్పారు. ఈ క్రమంలో ఎంసెట్ రాస్తే 1,600వ ర్యాంకు వచ్చిందని, దానికి రాష్ట్రంలో (ఉమ్మడి ఏపీ) మెడిసిన్ సీటు రాలేదని, కర్ణాటకలో ప్రవేశపరీక్ష రాస్తే వచ్చిందన్నారు.అక్కడికి వెళ్లాలని అనుకున్న తాను తండ్రి కేసీఆర్ చెప్పిన మాటలతో వెనక్కి తగ్గానన్నారు. మెడిసిన్ లో డిగ్రీ, పీజీ చదివి జీవితంలో స్థిరపడే సరికి వయసు 32 ఏళ్లకు చేరుతుంది.

అత్యవసర పరిస్థితుల్లో, అర్ధరాత్రిళ్లు పనిచేయాల్సి ఉంటుంది. జీవితం, పనిని సమన్వయం చేసుకోగలవా అంటూ మా నాన్న చెప్పడంతో నా ఆలోచన మారింది. మెడిసిన్ బదులు బయోటెక్నాలజీ వైపు వెళ్లానని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారని కొనియాడారు. హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ లోనే కాకుండా పరిశోధన రంగాల్లోనూ సత్తా చాటుతున్నారని కొనియాడారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా వర్కింగ్ ఉమెన్ ఉన్న రాష్ట్రం తెలంగాణయేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మంది ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్ హెల్త్ ప్రొఫెల్ ను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో వివరాలు సేకరించగా ఎక్కువ మందిలో క్యాన్సర్ తేలిందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ నిర్మించనున్న ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement