Thursday, April 25, 2024

ప్రగతికి ప్రతీకలు పటాన్ చెరు పల్లెలు : ఎమ్మెల్యే జీఎంఆర్

పటాన్ చెరు : గ్రామ పంచాయతీ వ్యవస్థలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల మూలంగా ప్రతి గ్రామం అభివృద్ధికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్ చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పండిట్ దీన్ దయాల్ సతత్ పంచాయతీ పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 9 అంశాల్లో గ్రామ పంచాయతీలకు అందిస్తున్న ఉత్తమ అవార్డులో తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక గ్రామ పంచాయతీలకు అవార్డులు రావడం సంతోషకరమన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల రూపురేఖలు మారుస్తుందన్నారు. ప్రతి నిర్ణయం ప్రజల ఆమోదం మేరకు తీసుకోవడంతో పాటు పూర్తి పారదర్శకతతో పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రతి పైసాను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను 100% సద్వినియోగం చేసుకుని పటాన్చెరు నియోజకవర్గ రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో రాష్ట్రపతికి లేని అధికారం గ్రామ పంచాయతీ సర్పంచ్ కు ఉందని, ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని గ్రామాన్ని ప్రభుత్వంలో నిలపాలని కోరారు. పటాన్చెరు నియోజకవర్గంలోని 55 గ్రామ పంచాయతీలలో 40 గ్రామ పంచాయతీలకు సొంత నిధులతో ట్రాక్టర్లు పంపిణీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. పలుచోట్ల జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో గ్రామపంచాయతీ భవనాలను సైతం నిర్మించడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో దేశంలోనే ఉత్తమ గ్రామపంచాయతీలుగా అవార్డు గెలుచుకునేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య, డిపిఓ సురేష్ మోహన్, ఎంపీపీలు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానంద్, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జడ్పిటిసిలు సుప్రజా వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, డి ఎల్ పి ఓ సతీష్ రెడ్డి, ఎంపిడిఓ లు బన్సీలాల్, మల్లీశ్వర్, రాములు, చంద్ర శేకర్, ఎంపిఓ లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement