Sunday, May 9, 2021

ఎన్నికల నిర్వహణకు అధికారుల కసరత్తు..

సిద్దిపేట : సిద్దిపేటలో పురపోరుకు రంగం సిద్దమైంది. ఎన్నికల సంఘం ప్రకటన వెలువరించడమే తరువాయి నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏఫ్రిల్‌ నెలాఖరులోనే మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం సంకేతాలు ఇస్తుండడంతో అధికారులు ఈ దిశగా కసరత్తును ముమ్మరం చేసారు. గడువులోగానే ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం సన్నద్దమౌతోంది. రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ నుండి స్పష్టమైన ఉత్తర్వులు జారీ కావడంతో ఈ నెలాఖరులోగానీ, వచ్చనెలలోగానీ మున్సిపల్‌ ఎన్నికలు జరుగనున్నట్టు స్పష్టమౌతోంది. పెరిగిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా వార్డుల విభజన, ఓటర్ల విభజనలను పూర్తి చేసిన అధికారులు ఈ నెల 11న తుది ఓటర్ల జాబితా విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న కులగణన పూర్తి చేసిన మున్సిపల్‌ అధికారులు గురువారం వార్డుల రిజర్వేషన్‌ల సంఖ్యను విడుదల చేసారు. పట్టణంలోని 43 వార్డుల్లో ఎస్టీ-1, ఎస్సీ జనరల్‌-2, ఎస్సీ మహిళ-1, బిసీ జనరల్‌-9, బిసీ మహిళ-8, జనరల్‌-10, జనరల్‌ మహిళ-12 కేటాయించారు. అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత రిజర్వేషన్ల తుది ప్రకటనను వెల్లడించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
ప్రస్తుత పాలక వర్గాల గడువు వచ్చే ఏఫ్రిల్‌ 15న పూర్తి కానుండడంతో ప్రక్రియను వేగవంతం చేసారు. సిద్దిపేట జిల్లా కేంద్రంగా ఏర్పడడం.. కొత్త ఓటర్లు భారీగా పెరిగిన నేపధ్యంలో వార్డుల పునర్విభజన అనివార్యమైంది. పురపాలికలో కొత్తగా మరో తొమ్మిది వార్డులు ఏర్పడనున్నాయి. ఫలితంగా ప్రస్తుతమున్న 34 వార్డులు 43కు పెరిగాయి. ఎన్నికల ప్రకటన ఏ క్షణాన విడుదలైనా సిద్దంగా వుండాలన్న లక్ష్యంతో అధికారులు ఓటర్ల తుదిజాబితా, వార్డుల విభజన పనులను ఇప్పటికే పూర్తి చేసారు. నిర్ణీత గడువులోగానే ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నందున ఏర్పాట్లను యుద్ద ప్రాతిపదికన చేస్తున్నారు. వార్డులవారిగా జాబితాలను తయారు చేయడంతో పాటుగా కొత్తగా ఏర్పాటు కాబోయే వార్డుల వల్ల జరిగే వార్డుల పరిధుల ఏర్పాటు కసరత్తు పూర్తయ్యింది.
—-పెరిగిన వార్డులు
సిద్దిపేట పురపాలికలో మహిళా ఓటర్లే అధికంగా వున్నట్టు తేలింది. ముసాయిదా ఓటరు జాబితాలో 43 వార్డులుండగా మొత్తం 1,00,658 ఓటర్లు వున్నట్టు తేల్చారు. వీరిలో 49,880 పురుష ఓటర్లుకాగా 50,767 మంది మహిళలు, 11 మంది ట్రాన్స్‌జెండర్లున్నారు. ఈ సంఖ్యకు అనుగుణంగా 43 వార్డులను ఏర్పాటు చేసారు.
—రిజర్వేషన్ల ప్రకటనే తరువాయి..
పంచాయితీల ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్‌ల ప్రకటన వెలువడడమే తరువాయి రంగంలోని దూసుకెళ్లడానికి ఆశావహులు సిద్దంగా వున్నారు. వార్డుల్లో కులాలవారిగా ఓటర్ల అంచనాపై దాదాపుగా స్పష్టత వస్తుండడంతో రాజకీయ పక్షాలు రిజర్వేషన్లపై ఒక అంచనాకు వస్తున్నాయి. కులాల వారిగా వుండే ఒటర్ల సంఖ్య ఆధారంగా ఎవరికివారే లెక్కలు వేసుకుంటున్నారు. పెరిగిన వార్డుల మూలంగా జరుగుతున్న పునర్విభజనతో సి ట్టింగులు ఆందోళన పడుతున్నారు. తమ సిట్టింగ్‌ స్థానం రెండుగా విడిపోతే పరిస్థితి ఏంటి.. ? రిజర్వేషన్‌ అనుకూలిస్తుందో..లేదో ? లేనిపక్షంలో తమకు రిజర్వేషన్‌ అనుకూలంగా వుండే వార్డులు ఎక్కడెక్కడ వుంటాయన్న ఉత్కంఠతో కొట్టుమిట్టాడుతున్నారు. మరికొంతమంది ఆశావహులు తమకు అనుకూలమైన రిజర్వేషన్లను తెప్పించుకోవడానికి ఏమైనా అవకాశాలున్నాయా అన్న దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
—పెరుగనున్న మహిళా అభ్యర్థులు
రానున్న మున్నిపల్‌ ఎన్నికల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వు కావడంతో ఆశావహులు తమ సతీమణులను రంగంలోకి దించనున్నట్టు బాహటంగా చెపుతున్నారు. భార్యలు కౌన్సిలర్‌లైనా ఏలాగూ అధికారం తమదే కదా అన్న ఆలోచనతో కొంతమంది సిట్టింగులు సైతం తమ సతీమణులను పోటీలోకి దించనున్నట్టు తెలుస్తోంది. ఏరకంగా చూసినా రానున్న మున్సిపోల్స్‌లో మహిళల సంఖ్య పెరుగనున్నట్టు స్పష్టమౌతోంది.
—వ్యూహరచనలో పార్టీల నేతలు
మున్సిపల్‌ ఎన్నికలు వచ్చే సూచనలు ప్రస్పుటం కావడంతో రాజకీయ పార్టీలు వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి. వార్డులవారిగా గెలుపు గుర్రాల ఎంపిక, వర్గాల ఓటర్లను ఆకర్శించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆయా పార్టీల నేతలు తలమునలవుతున్నారు. మహిళలను, యువతను ఆకర్శించేందుకు ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేసారు. ముసాయిదా ప్రకారం ఆయా వార్డుల్లో ఏ రిజర్వేషన్‌ వచ్చే అవకాశముందనే అంచనాకు వచ్చిన నేతలు పరిస్థితులను తమక అనుకూలంగా మలచుకునే దిశగా పావులు కదుపుతున్నారు.

మెజారిటీ సీట్లను సాధిస్తాం: బొమ్మల యాదగిరి, కాంగ్రెస్‌ పార్టీ సిద్దిపేట జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు
సిద్దిపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన కార్యకర్తలున్నారు. గతానికి భిన్నంగా ఈ సారి అన్ని వార్డుల్లో పోటీ చేస్తాం. ప్రజాదరణ వున్న వ్యక్తులనే రంగంలో దింపి మెజారిటీ సీట్ల సాధనే లక్ష్యంగా పనిచేస్తాం. గత ఐదేళ్లలో మున్సిపాలిటీలో పారదర్శకత లోపించింది..అభివృద్ది పనులు అన్ని వార్డుల్లో సమ న్యాయంతో జరగడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. మున్సిపాలిటీలొ పలుకుబడి వున్న కొంతమంది హవానే నడుస్తోంది. సామాన్యుల సమస్యలను పట్టించుకునే వారు లేరన్న ఆరోపణలున్నాయి.
మున్సిపల్‌ పీఠం టిఆర్‌ఎస్‌దే: కొండం సంపత్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ సిద్దిపేట పట్టణ శాఖఅధ్యక్షుడు
మునిసిపాలిటీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసి ఛైర్మన్‌ పీఠం సాధించుకోవడం ఖాయం. ప్రతిపక్షాలు ఒకటి, రెండు సీట్లకే పరిమితమవడం తథ్యం. మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో జరిగిన కోట్లాది రూపాయల అభివృద్ది పనులే టిఆర్‌ ఎస్‌ పార్టీని భారీ మెజారిటీతో గెలిపిస్తాయి. సిద్దిపేట పట్టణం అభివృద్దిలో జాతీయస్థాయిలో గుర్తింపు పొందినా ఇతర పార్టీల నేతలకు కన్పించక పోవడం శోచనీయం. వారు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా వారి మాటలు ప్రజలు నమ్మేస్థితిలో లేరు.

Advertisement

తాజా వార్తలు

Prabha News