Friday, May 17, 2024

Flash: అంబేడ్కర్ జయంతిని జరపాలంటూ మావోయిస్టుల లేఖ

కుల నిర్మూలన కోసం, పెట్టుబడిదారీ విధానానికి-సామ్రాజ్యవాదానికి, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేక సంకల్పంతో బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతిని జరపాలంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ విడుదల చేసింది. బ్రాహ్మణీయ హిందుత్వ మొండిఘటమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు చెందిన బీజేపీ, దాని ప్రభుత్వం తరఫున ప్రధాన మంత్రి మోదీ ఏప్రిల్ 14వ తేదీన అంబేడ్కర్ జయంతిని ఘనంగా జరపాలన్నారు. కుల నిర్మూలన కోసం, పెట్టుబడిదారీ విధానానికి-సామ్రాజ్యవాదానికి, మొండిఘటమైన బ్రాహ్మణీయ హిందుత్వానికి వ్యతిరేక సంకల్పంతో ఈ దినాన్ని జరుపుకోవలసిందిగానూ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) పిలుపునచ్చింది. బూటకపు చైతన్యంతోను, కుల నిర్మూలన, హిందుత్వ మత మనుధర్మశాస్త్రాన్ని, పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకించాలన్న అంబేడ్కర్ బోధనల అసలు సారాన్ని దళిత ప్రజలకు లేకుండా చేస్తూ అంబేడ్కర్ జయంతిని జరపడం వెనుక హిందుత్వ ఫాసిస్టు శక్తుల కుట్రను మనం బహిర్గతపరచాలన్నారు.

”పుట్టుక నాటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్, భాజపా హిందుత్వ సంస్థలన్న విషయం తెలిసినదే. సైద్ధాంతిక అర్థంలోనే కాకుండా ఇవి అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని రోజువారీ జీవితంలో కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. బ్రాహ్మణీయ హిందుత్వ పాలక భాజపా గడచిన 8 సంవత్సరాలుగా భారతదేశాన్ని ఫాసిస్టు పద్ధతిలో మెట్టు మెట్టుగా నిర్మిస్తున్నది. దానికి ప్రజాకర్షకంగా ‘నూతన భారతం’ అన్న పేరు ఇచ్చింది. భాజపా ప్రభుత్వం దళిత, ఆదివాసీ, ముస్లిం, మహిళా వ్యతిరేక విధానాలను అమలు చేస్తుండడమే కాకుండా, నిరంతరం, ఎన్నడూ ఎరుగని విధంగా రైతాంగ, కార్మిక, మధ్య తరగతి వర్గాలకు వ్యతిరేకంగా విధానాలను తీవ్రతరం చేసింది. నిజానికి ఇవి కాషాయ రంగులో ఎల్‌పీజీ విధానాలే. ఒక పక్క త్రిపుల్ తలాక్ చట్టం చేస్తారు; 370, 35ఏ అధికరణాలను రద్దు చేస్తారు; అయోధ్యలో రామమందిరానికి శంకుస్థాపన చేశారు; దళిత, ఆదివాసీ ప్రజల రాజ్యాంగబద్ధ హక్కులను బహిరంగంగా ఉల్లంఘిస్తూ అనేక చట్టాలను తీసుకువచ్చేందుకు విఫలయత్నాలు చేస్తున్నారు; రిజర్వేషన్లను నిలిపివేయాలని, లేదా వివిధ మార్గాలలో అర్హులైన వారికి రిజర్వేషన్లు అందకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు; గోరక్షణ పేరుతో మూక హత్యలు చేస్తున్నారు; దళిత, ఆదివాసీ ప్రజల ఆహార అలవాట్లు, జీవనం, ఆచార సంప్రదాయాలపై దాడి, నిషేధం, అవమానం చేస్తున్నారు; గుడ్డి రాష్ట్రీయోన్మాదంతో దళిత, ఆదివాసీ, మతపర అల్పసంఖ్యాక ప్రజలను, ముఖ్యంగా ఆడపిల్లలను చదువుకు దూరం చేస్తున్నారు; రైతు వ్యతిరేక, దేశద్రోహకర మూడు వ్యవసాయ చట్టాల ద్వారా దేశ వ్యవసాయాన్ని నాశనం చేసేందుకు విఫలయత్నం చేస్తున్నారు. ఇటువంటివే మరిన్ని ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక విధానాలను తీసుకువస్తున్నారు. మరో పక్క అంబేడ్కర్ జయంతిని జరుపుతున్నారు. పీడిత ప్రజలను, ముఖ్యంగా దళిత ప్రజలను హిందుత్వంలో భాగం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  దళిత, ఆదివాసీ ప్రజలకు కొద్ది పాటి హక్కులను అందించిన అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే కాకుండా భాజపా ప్రభుత్వం దాన్ని ముగించాలని కూడా చూస్తున్నది” అని లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement