Saturday, May 25, 2024

Maktal – కొడంగల్, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఓటమి తథ్యం – కేటీఆర్

మక్తల్ నవంబర్23(ప్రభన్యూస్) తెలంగాణ లో కరెంట్ కావాలో కాంగ్రెస్ కావాలో ప్రజలు మీరే నిర్ణయించుకోవాలని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు .24 గంటల కరెంటు కావాలంటే బిఆర్ఎస్ కు ఓటు వేయండి మూడు గంటల కరెంటు కావాలనుకుంటే కాంగ్రెస్కు ఓటు వేయండి ఏది కావాలో ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ధరణిలో చిన్నచిన్న లోపాలు ఉన్న మాట వాస్తవమేని అయితే ధరణి రద్దు చేస్తే మళ్లీ దళారుల రాజ్యం కొనసాగుతుంది జాగ్రత్త అన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద 167వ జాతీయ రహదారిపై నిర్వహించిన రోడ్ షోలో స్థానిక బిఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు నిర్విరామంగా అందిస్తున్నదని అన్నారు.వ్యవసాయానికి ఉపయోగించే కరెంటు మోటారు హెచ్ పి తెలియని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యవసాయం పట్ల ఏమాత్రం అవగాహన లేదని అన్నారు. 24 గంటల కరెంటు ఇస్తూ రైతులకు రైతుబంధు రైతు బీమా వంటి పథకాల అమలు చేస్తున్న బిఆర్ఎస్కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 10 ఏళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని నడుస్తున్న అభివృద్ధిని ముందుకు తీసుకు వెళ్దామని అందుకు ప్రతి ఒక్కరూ తమతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఆగం కావడం తప్ప ఏమీ సాధించలేవని అన్నారు. 11 సార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోయారని మరోసారి ఒక్క అవకాశం ఇవ్వండి అని కోరుతున్న కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు. కర్ణాటకలో ఐదు హామీలు ఇచ్చి చేతులెత్తేసిన కాంగ్రెస్ తెలంగాణలో ఆరు హామీలు ఇచ్చి అమలు చేస్తామని చెప్పడం చూస్తుంటే నమ్మడానికి ఇక్కడి ప్రజలు పిచ్చోళ్లు కాదని అన్నారు. మక్తల్ కు పక్కనే ఉన్న కర్ణాటక కు వెళ్లి అక్కడ కరెంటు ఉందా అభివృద్ధి జరుగుతుందా చూసి రావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు .సోషల్ మీడియాలో ఏదో కథనాలు వస్తుంటాయని వాటిని ఏమాత్రం పట్టించుకోదని అన్నారు .తెలంగాణలో కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు మళ్లీ మొదలవుతాయని అన్నారు. కరెంటు కోసం ధర్నాలు రాస్తారోకోలు ట్రాన్స్ఫార్మర్ల మరత్తుల కోసం కొట్లాటలు తప్పవని అందుకే కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయి గోస పడవద్దని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ లో కామారెడ్డి లో రెండు చోట్ల ఓడిపోనున్నారని అధ్యక్షుడే ఓడిపోయే పార్టీ ఎక్కడైనా గెలుస్తుందా అన్నారు. అభివృద్ధి కోసం మరోసారి బిఆర్ఎస్ ను గెలిపించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు .స్థానిక బిఆర్ఎస్ అభ్యర్థి విన్నపం మేరకు మక్తల్ రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అదేవిధంగా ఆత్మకూరులో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో పాలమూరు పార్లమెంటు సభ్యులు మన్నె శ్రీనివాసరెడ్డి ,బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఎన్నికల ఇన్చార్జి డాక్టర్ ఆంజనేయులు గౌడ్, నాయకులు సుచరిత రెడ్డి, కొత్త శ్రీనివాస్ గుప్తా ,టి. లలితమ్మ ముదిరాజ్ ,పసుపుల దత్తు, రాజుల ఆశిరెడ్డి ,పి. నరసింహ గౌడ్, కే .రాజేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement