Sunday, May 5, 2024

గ్రామ సేవకులను ప్రభుత్వ ఉద్యోగులుగా కల్పించిన ఘనత కెసిఆర్ దే – మంత్రి నిరంజన్ రెడ్డి

పెద్దమందడి; ఆగస్టు 10 (ప్రభ న్యూస్); భూస్వామ్య వ్యవస్థలో ఉన్న గ్రామ సేవకులు అనే అభ్యంతరకర పదాన్ని తొలగించి ప్రభుత్వ ఉద్యోగులుగా నియామకం కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఏడాది పాటు రాష్ట్రంలోని భూరికార్డులను శుద్ధి చేసి రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసిన తర్వాత గ్రామ సేవకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వివిధ శాఖలకు కేటాయించడం జరిగిందని చెప్పారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆయా శాఖలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసే ప్రక్రియ మొదలు కాగానే వనపర్తి జిల్లాలో సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన నియామక ఉత్తర్వుల జారీ ప్రక్రియకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై వీఆర్ఏలకు నియామక ఉత్తర్వులు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాలు, మరెన్నో అవమానాలు బాధలు అనుభవించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని అది ఇలాంటి చారిత్రక రోజు కోసమేనని అభివర్ణించారు. వీఆర్ఏలను ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయమని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి శాఖలను కేటాయించి నియామక పత్రాలు అందజేశామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డిఓ పద్మావతి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement