Friday, April 19, 2024

ప్రీతిని డాక్టర్ చేసే బాధ్యత మాది… మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కారంతండాకు చెందిన పేదింటి గిరిజన బిడ్డ ప్రీతి ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ సీటు సాధించింది. కానీ అనారోగ్యంతో ఆమె తండ్రి సభావాత్ శంకర్ నాయక్ మృతి చెందటం, బతుకుదెరువు కోసం తల్లి శాంతిభాయి వలస వెళ్లడం, కడు పేదరికం కారణంగా ప్రీతి వైద్య విద్యను అభ్యసించలేకపోతుందని తెలిసిన వెంటనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆమెకు అండగా నిలవాలని భావించారు. మంగళవారం ప్రీతిని తమ సిబ్బంది ద్వారా హైదరాబాద్ లోని తమ క్యాంప్ కార్యాలయానికి పిలిపించారు. ప్రీతి విద్యాభ్యాసం, పట్టు వదలకుండా ఆమె మెడిసిన్ సాధించిన విధానాన్ని మంత్రి తెలుసుకున్నారు. ఒకవైపు పేదరికం బాధిస్తున్నా వైద్యురాలు అవ్వాలనే ఆమె తపన మంత్రిని ఎంతో కదిలించింది.

అన్ని సౌకర్యాలు, ఆర్థిక వెసులుబాటు ఉన్నప్పటికీ మెడిసిన్ సాధించడం ఎంతో కష్టమని, తండ్రి మృతిచెందిన తల్లి కూలీ పని చేస్తున్నా, పేదరికం వేధిస్తున్నా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో మెడిసిన్ సీటు సాధించినందుకు మంత్రి అభినందించారు. ఆర్థిక అవకాశాలు లేక చదువును ఆపాల్సిన అవసరం లేదని తెలిపారు. మెడిసిన్ పూర్తి చేసే వరకు శాంతా నారాయణ గౌడ్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్ని విధాలా అండగా ఉంటామని, ఆమె చదువుకు అయ్యే ప్రతి పైసా ఖర్చును తామే భరిస్తామని భరోసా ఇచ్చారు. పేదరికం వేధిస్తున్న మొక్కవోని దీక్షతో ఎంబీబీఎస్ సాధించిన ప్రీతిని శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీహిత, ట్రెజరర్ శ్రీ హర్షిత, డా. వంశీ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement