Sunday, April 28, 2024

MBNR: గ్రూప్ 2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలి.. హర్షవర్ధన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 29, 30 తేదీల్లో నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షను వెంటనే మూడు నెలల పాటు వాయిదా వేయాలని టిపిసిసి అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆగస్టు ఒకటో తేదీ నుండి 23వ తేదీ వరకు గురుకులాలకు సంబంధించిన రిక్రూట్ మెంట్ జరుగుతుందని, సెప్టెంబర్ లో జూనియర్ లెక్చరర్ల రిక్రూట్ మెంట్ జరుగుతుందని, అంతేకాక 74 బ్యాంకులకు సంబంధించి బ్యాంకింగ్ ఉద్యోగాల పరీక్షలు కూడా ఈ నెలలోనే ఉన్నాయని పేర్కొన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మూడు నెలల పాటు గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని కోరారు.

ముఖ్యంగా గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీకేజీ వల్ల వాయిదా పడి రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలోనే నిర్వహించింది. పరీక్షకు పరీక్షకు గడువు తక్కువగా ఉన్నందున అభ్యర్థులు ప్రిపేర్ అవడానికి ఇబ్బంది ఉందని, కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రూప్ 2 పరీక్షకు కొంత సమయం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రూప్ టు పరీక్షకు అదనంగా సిలబస్ చేర్చడం వల్ల వాటికి సంబంధించిన ప్రామాణిక పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో లేనందువల్ల అభ్యర్థులు చదువుకునేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కాకుండా నిరుద్యోగుల పక్షాన వారి సమస్యలు తెలిసిన వ్యక్తిగా గ్రూప్ 2 అభ్యర్థులకు గడువు ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రచార కార్యదర్శి సిజె బెనహర్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజాబాలచందర్ గౌడ్, నాయకులు మురళిగౌడ్, దిలీప్ కుమార్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement