Friday, October 11, 2024

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద‌పీట : మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి ప్రతినిధి, (ప్రభ న్యూస్): ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ గ్రామల అభివృద్ధికి పెద్ద‌పీట వేస్తున్నార‌ని, గ్రామీణ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నూతన పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి మండల పరిధిలోని పెద్దగూడెం గ్రామంలో 20 లక్షలతో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. అద్దె భవనాలతో, శిథిలావస్థలో కొనసాగుతున్న పంచాయతీలకు పక్కా భవనాలు మంజూరు చేసి గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించి గ్రామీణ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు దృష్టి సారించింది.. జిల్లాలో నూతన పంచాయతీలతోపాటు పంచాయతీ భవనాలు లేని గ్రామాలకు పక్కా భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించారన్నారు. కేసీఆర్‌ పాలనలో గ్రామాలకు సముచిత న్యాయం జరిగేలా గ్రామీణ ప్రాంతాలు బలోపేతమయ్యాయన్నారు.

అదే విధంగా కుల వృత్తులకు రైతులకు అండగా ఉంటూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని పేర్కొన్నారు. వ్యవసాయానికి సాగునీరు, ఉచిత కరెంట్‌తోపాటు పంట పెట్టుబడి కోసం రైతుబంధు, రైతు కుటుంబాలకు ఆసరాగా రైతు బీమా పథకం అండగా నిలుస్తున్నాయని, గొల్లకురుమలకు ఉచితంగా గొర్రెలు, రజక, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నరన్నారు. అర్హులైన వృద్ధులకు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, గీత, నేత కార్మికులందరికీ ఆసరా పింఛన్లు, ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం, సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తూ పల్లెలు అభివృద్ధి బాటలో నిలిపేందుకు పంచాయతీలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయిచంద్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, సురవరం ప్రతాపరెడ్డి, సి నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు కృష్ణమోహన్ రెడ్డి. కృష్ణ వర్ధన్ రెడ్డి, సూరి పేట వెంకటేశ్వర్ రెడ్డి, చెన్నయ్య, రావులపాటి సీతారాం, జిల్లా అధికారులు, విద్యార్థులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement