Tuesday, April 30, 2024

బెల్టుషాపుల దందా.. అధిక ధ‌ర‌ల‌తో దోపిడీ

మానవపాడు, ఏప్రిల్18 (ప్రభ న్యూస్) : తాగేందుకు బుక్కడు నీరు లేని పల్లెలు ఉన్నాయి… కానీ మందు దొరకని పల్లెలు మాత్రం ఒక్కటి లేదు. పల్లెల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు, మారుమూల గ్రామాలు మత్తులో జోగుతున్నాయి. గ్రామాల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్ దుకాణాలు వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అనేకమంది బెల్ట్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అప్పులు చేసి తాగడంతో కుటుంబాలు వీధిపాలవుతున్నాయి. ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామంలో ప్రముఖ జమ్ములమ్మ ఆలయానికి ఇతర రాష్ట్రాల నుండి మొక్కలు తీర్చుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారు. ఆలయం చుట్టూ వచ్చే భక్తులకు ఇబ్బందికరంగా బెల్టుషాపులు, వైన్ షాపులను తలపిస్తున్నాయి. ఇక్కడ బెల్టు షాపుల్లో రోజుకు లక్షకు పైనే ఆదాయం వస్తుంది. ఇక్కడికి వచ్చిన భక్తులకు మందుబాబులతో ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఎన్నో, ప్రతి షాపు నుండి రూ.10వేలు ఎక్సైజ్ అధికారులకు ముట్టజెప్పుతున్నట్లు సమాచారం.
పేరుకే కిరాణం… కానీ అమ్మేది మధ్యమే!
మానవపాడు, ఉండవెల్లి మండల పరిధిలో అనేకమంది పేరుకే కిరాణా దుకాణాలు నిర్వహిస్తూ లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నారు. సొంత ఇళ్లలో పెద్ద ఫ్రిజ్ లు పెట్టుకొని మరీ విక్రయిస్తున్నారు. వైన్ షాప్ ల యజమానులు ఆటోల ద్వారా మద్యాన్ని ఊరూరా సరఫరా చేస్తున్నారు. తమకు కేటాయించిన గ్రామాలకు నిత్యం ఆటోల ద్వారా పేరుమోసిన బ్రాండ్లను పంపించి సొమ్ము చేసుకుంటున్నారు. మద్యం మత్తులో ఇళ్ల మధ్యలో గొడవలు పడుతూ అర్ధరాత్రి వరకు నానా రభస చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతుందనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.


మందు మొత్తం బెల్ట్ షాపులకు :
ఉండవెల్లి, మానవపాడు మండలంలోని వైన్ షాప్ నిర్వాహకులు బెల్ట్ షాపులకు మందు విక్రయించేందుకే అధిక ప్రియారిటీ ఇస్తున్నారు. కస్టమర్స్ కు నేరుగా అమ్మితే ఎమ్మార్పీ వస్తుంది. అదే బెల్ట్ షాప్ కు అమ్మితే ఎమ్మార్పీకి మించి అమ్మొచ్చనే ఉద్దేశంతో వైన్ షాప్ నిర్వాహకులు ఈ పనికి పాల్పడుతున్నారు. వైన్ షాపుల్లో మామూలు లిక్కర్ ఉంచి… బెల్ట్ షాపులకు మంచి మందులు సప్లై చేస్తున్నారు. పేరున్న బ్రాండ్లను క్వార్టర్ బాటిల్ పై రూ.20 వరకు ఎక్కువ రేట్లకు బెల్ట్ షాపులకు పంపిస్తున్నారు. మొదట ఎమ్మార్పీ పై రూ.5 అదనంగా అమ్మిన వైన్ షాప్ ల నిర్వాహకులు, ఇప్పుడేమో ఏకంగా క్వార్టర్ బాటిల్ పై రూ.20 అదనంగా బెల్ట్ షాపు నిర్వాహకుల వద్ద తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాళ్లు మరో రూ.20 తీసుకొని కస్టమర్లకు ఇస్తున్నారు. వైన్ షాపుకు వచ్చిన కస్టమర్లకు మాత్రం అడిగిన బ్రాండ్ లేదని, ఇతర బ్రాండ్లకు చెందిన సీసాలను అంటగడుతున్నారు. దీంతో కొన్నిసార్లు షాపులోని సిబ్బందితో కస్టమర్లు గొడవకు దిగుతున్నా పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వైన్ షాపుల యజమానుల నిర్వాహకంతో మండలంలో రోజుకో కొత్త బెల్ట్ షాపు పుట్టుకొస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు.

హైవేపై ఉన్న వైన్ షాపులు చట్టవిరుద్దంగా ఉంటే చర్యలు తప్పవు.
బెల్టుషాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవు.. హన్మా నాయక్, అలంపూర్ ఎక్సైజ్ సిఐ
అలంపూర్ నియోజకవర్గ పరిధిలో ఎక్కడైనా మద్యం బెల్టు షాపు నిర్వహిస్తే విక్రయదారుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు మద్యం షాపు లైసెన్స్‌ను రద్దు చేస్తామని, గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా కఠిన చర్యలు తప్పవని అలంపూర్ ఎక్సైజ్‌ సిఐ హన్మా నాయక్ ఆంధ్రప్రభ కు తెలియజేశారు. హైవేపై ఉన్న వైన్ షాపులు చట్ట విరుద్ధంగా ఉంటే చర్యలు తప్పవన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement