Thursday, July 25, 2024

Mahabubnagar – ఆక్ర‌మ‌ణ‌లు తొలగించి ప‌ట్ట‌ణాభివృద్దికి స‌హ‌క‌రించండి – ప్ర‌జ‌ల‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, జూలై 9 (ప్రభ న్యూస్) : గతంలో ఇరుకైన రహదారులతో, గుంతలతో,వర్షపు నీటితో పట్టణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనడమే కాకుండా ట్రాఫిక్ తో అనునిత్యం సమస్యలు ఎదుర్కొన్నారని, అలాంటిది తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విశాలమైన రహదారులు, జంక్షన్ల అభివృద్ధితో పట్టణానికి ఒక రూపును తీసుకువచ్చినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం అయన పట్టణంలోని అబ్దుల్ ఖాదర్ దర్గ వద్ద ఉన్న రహమానియా బ్రిడ్జిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అప్పనపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించడానికి 12 సంవత్సరాలు పట్టిందని,రైల్వే గేట్ పడినప్పుడు అంబులెన్స్ లు ఆగి ప్రాణాలమీడికి వచ్చిన పరిస్థితి ఉండేదని, అలాంటిది ఇప్పుడు భూతపూర్ నుండి మహబూబ్ నగర్,జడ్చర్ల నుండి మహబూబ్ నగర్ పట్టణానికి వచ్చేందుకు విశాలమైన రహదారులు నిర్మించామని, పట్టణంలోని రహదారులన్నింటిని విస్తరించడమే కాకుండా, జంక్షన్లు సైతం అభివృద్ధి చేశామని, అస్తవ్యస్త రహదారులతో అవస్థలు పడకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇంకా పట్టణంలో రహదారులపై కొన్ని ఆక్రమణలు ఉన్నాయని వాటిని తీసే విషయంలో అందరు సహకరిస్తే ఇంకా విస్తారమైన రోడ్లను తీర్చిదిద్దుతామని తెలిపారు.

రహమానియా బ్రిడ్జి పక్కన ఉన్న పెద్ద మురికి కాలువలో డ్రైవ్ వాటర్ వెళ్లేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టం ఏర్పాటు చేసి మంచినీళ్లు ప్రవహించే విధంగా చర్యలు తీసుకుంటామని, ఒక ఫౌంటెన్ ఏర్పాటు చేస్తామని, వేపురిగెరి , చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ప్రశాంతంగా ఉండే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలగించి అభివృద్ధికి సహకరించాలని ఆయన పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో పట్టణానికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలతో పాటు, ఇంకా ఎంతో అభివృద్ధి రానుందని, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని రోడ్లను విస్తరించామని, ఇక్కడ యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించేందుకు ఐటి పార్కు ఏర్పాటుతో చర్యలు తీసుకోవడమే కాకుండా, పిల్లలు చదువుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాలను తీసుకువచ్చామని, పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కే.సి నర్సింహులు, ముండా చైర్మన్ గంజి వెంకన్న, వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్లు రామ్ లక్ష్మణ్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, డి.ఎస్.పి మహేష్, జాతీయ రహదారుల సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్,ఆర్ అండ్ బి డి ఈ సంధ్య,ఇతర అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement