Tuesday, April 30, 2024

దేశమే చూసి నేర్చుకునేలా.. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది: హరీష్‌ రావు

సిద్దిపేట ప్రతినిధి, నంగునూర్‌, ప్రభ న్యూస్‌: నంగునూర్‌ మండలం కలిసి కట్టుగా పని చేయాలని కోరారు రాష్ట్ర ఆర్థిక, వైద్యా, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు. పార్టీ బలోపేతానికై క్రియాశీలకంగా ఉండాలని చెప్పారు. మంగళవారం సాయంత్రం మండల ముఖ్య నాయకులతో క్యాంప్‌ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక టీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం పేదల కోసం అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని, బీజేపీ సోషల్‌ మీడియా ఫేక్‌ ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచిన తీరుపై ఆగ్రహించారు. కొత్త బడ్జెట్లో రాష్ట్రానికి ఇచ్చే సబ్సీడీపై కోత విధించినందువల్ల రైతులకు ఎరువులు, యూరియా, డీఏపీ ధరలు పెరుగుతాయని వివరించారు. ప్రతియేటా జీడీపీలో 4 శాతం అప్పు రూపేణా తీసుకునే అనుమతి, అవకాశం ఉండేదని, కానీ ఈ సారి 3.5 శాతం ఎప్పటిలాగానే తీసుకోవచ్చని ఒక అరశాతానికి మెలిక పెట్టిందని, విద్యుత్తు చట్టంలో సవరణలు చేయాలని, బాయిలకాడ విద్యుత్తు మీటర్లు పెట్టాలని, బాయిల కాడ మీటర్లు పెడితే అరశాతం మీ రాష్ట్రానికి అప్పు తీసుకునేందుకు అనుమతి ఇస్తామని మెలిక పెట్టిందని, దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు సంక్షేమమే ధ్యేయంగా తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీటర్లు పెట్టనని తేల్చిచెప్పారని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులను మంత్రి కోరారు. బీజేపీ రైతులపై భారం వేస్తుందని, ఎరువుల ధరలు పెంచి, బాయి కాడ మీటర్లు పెట్టి ముక్కుపిండి పైసలు వసూళ్లు చేసే పనిలో పడిందని, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి వడ్లు కొనేది కేంద్రమే, ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు మారాయని, కానీ ఈ యాసంగిలో వడ్లు కొనమని చెప్పిన కేంద్రం తీరును అర్థమయ్యేలా వివరించాలని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, ప్రతి ఏటా పెట్టుబడి సాయం కింద రైతుబంధు, అలాగే రైతు భీమా, దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా, ఇతర రాష్ట్రాలలో అయినా ఇలా ఇస్తున్నారా అని ప్రజలకు వివరించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం రైతును కాపాడే ప్రయత్నం చేస్తుందని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం సిలిండర్లు, ఎరువులు ఇతరత్రాలపై సబ్సీడీ పేరిట కోతలు, వాతలు తప్ప కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిందేమీ లేదని, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులుగా ఈ విషయాలని ప్రజలు అర్థమయ్యేలా వివరించాలని కోరారు. బట్టేబాజ్‌, జూటేబాజ్‌ పార్టీ బీజేపీ అని గ్రామ, క్షేత్ర స్థాయిలో ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని, ఆ పథకాలను ఇప్పటికే కేంద్రం కాపీ కొడుతున్నద న్న విషయాన్ని ప్రజాక్షేత్రంలో సమగ్రంగా అర్థమయ్యేలా ప్రజలకు వివరించాలని, టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, యువత నిజాన్ని, వాస్తవాన్ని గ్రహించి బీజేపీ చేసే గోబెల్స్‌ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. 70 ఏండ్ల కాలంలో కాని పనిని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లలో అభివృద్ధి చెందిందని, రైతు శ్రేయస్సుకై ప్రభుత్వం పాటు పడిందని వివరించాలని పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement