Wednesday, November 29, 2023

TS: రేపు పెద్దపల్లికి ప్రగతి ప్రదాత కేటీఆర్ .. రూ.134కోట్ల పనులకు శంకుస్థాపనలు

పెద్దపల్లి, సెప్టెంబర్‌ 30 (ప్రభన్యూస్‌): నియోజకవర్గ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేసిన అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం పెద్దపల్లికి రానున్నారు. 134 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మంత్రి కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. పట్టణం గులాబీ మయంగా మారింది. పెద్ద ఎత్తున రాజీవ్‌ రహదారిపై హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. రూ.134కోట్ల అభివృద్ధి పనులకు గాను శిలా ఫలకాలను జూనియర్‌ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేస్తున్నారు. 11కోట్ల రూపాయల డీఎంఎఫ్‌టీ నిధులతో పెద్దపల్లి, ఓదెల వయా కొత్తపల్లి రోడ్డు పనులకు, రూ.9.04 కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులతో పెద్దబొంకూర్‌ నుంచి కొలనూర్‌ వరకు, రూ. 6.50 కోట్లతో నిర్మించ తలపెట్టిన కాచాపూర్‌, కాసులపల్లి రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

- Advertisement -
   

అలాగే రూ.3.06 కోట్ల నిధులతో ఎలిగేడు, వడ్కాపూర్‌ రోడ్డు పనులను, రూ.5కోట్లతో నిర్మించనున్న అందుగులపల్లి నుంచి దేవునిపల్లి వరకు రోడ్డు పనులను, రూ.5.52 కోట్లతో నిర్మించే బొంపల్లి నుంచి అప్పన్నపేట వరకు రోడ్డు పనులను, కునారం నుంచి ముత్తారం రోడ్డు వరకు రూ.4.50 కోట్లతో నిర్మించే రోడ్డుకు, రూ.10.95కోట్లతో పెద్దపల్లి, ఓదెల వయా జగ్గయ్యపల్లి, అబ్బిపల్లి, రాయపేట వరకు రోడ్డు పనులను, రూ.7కోట్లతో పెద్దపల్లి, జూలపల్లి వయా తుర్కల మద్దికుంట వరకు రోడ్డు పనులను, రూ.12 కోట్లతో నిర్మించే కటికెనపల్లి నుంచి పెద్దపల్లి వరకు రోడ్డు పనులను, రూ.13.30 కోట్లతో పెద్దపల్లి, ఓదెల వయా కొత్తపల్లి, కొలనూర్‌ వరకు రోడ్డు పనులను, పెద్దపల్లి నుంచి జూలపల్లి వయా కాచాపూర్‌ వరకు రూ.19.80 కోట్లతో నిర్మించే రోడ్డు పనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రూ. 25కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో నిర్మించే అభివృద్ధి పనులకు, స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ నుంచి రూ.కోటితో నిర్మించే పనులకు, రూ.50లక్షలతో నిర్మించే, నిర్మించిన జంక్షన్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జూనియర్‌ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి మంత్రి కేటీఆర్‌ బహిరంగ సభ కోసం పెద్దపల్లికి తరలించేందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. జూనియర్‌ కాలేజీ మైదానంలో ఏర్పాట్లను, పట్టణ అలంకరణ పనులను ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement