Sunday, April 28, 2024

KTR: మ‌ల్కాజ్​గిరి లోక్ స‌భ సీటు గెలవాల్సిందే…కాంగ్రెస్, బిజెపిల‌కు బుద్ది చెప్పాల్సిందే…

గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇంకో ఏడెనిమిది స్థానాలు అదనంగా గెలిచి ఉంటే తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వచ్చేదని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత నవంబర్‌లోనే ప్ర‌క‌టించార‌ని అంటూ ప్రస్తుతం తాను వారి మాటలనే గుర్తు చేశానని తెలిపారు.

తాను కరెంట్‌ బిల్లులు కట్టొద్దంటే డిప్యూటీ సీఎం భట్టి తనది విద్వంసకర మనస్తత్వం అని అంటున్నారని మండిపడ్డారు. నిజాలు మాట్లాడితే విద్వంసకర మనస్తత్వమా? అని ప్రశ్నించారు. కరెంటు బిల్లులు కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీకే పంపుదామని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఇప్పటినుంచే ఒత్తిడి తేవాలని కార్యకర్తలకు తెలియజేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కన్నా కేవలం నాలుగు లక్షల ఓట్లు ఎక్కువ సాధించింద‌ని, తక్కువ ఓట్ల తేడా తో 14 సీట్లు కోల్పోయామ‌ని వివ‌రించారు. పోయిన సారి మల్కాజ్ గిరి లోక్ సభ స్థానాన్ని అతి తక్కువ ఓట్లతో కోల్పోయామ‌ని , ఈసారి మాత్రం భారీ మెజార్టీతో విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌న్నారు. మ‌ల్కాజ్‌గిరి గెలుపు ద్వారా కాంగ్రెస్, బిజెపిల‌కు బుద్ది చెబుదామ‌ని అన్నారు. నిరుద్యోగ భృతి పై భట్టి ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా మాట తప్పార‌ని గుర్తు చేశారు.

నిరుద్యోగ భృతి పై కాంగ్రెస్ తప్పించుకున్నట్టే పాలమూరు రంగారెడ్డి కి జాతీయ హోదా పై మాట మార్చింద‌న్నారు కెటిఆర్. కాంగ్రెస్ హామీల నుంచి తప్పించుకుంటున్న తీరును ప్రజా కోర్టు లోనే సాధికారికంగా ఎండగట్టాల‌ని పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సమాచార హక్కు చట్టాన్ని కూడా కార్యకర్తలు సమర్ధంగా వాడుకోవాల‌ని సూచించారు. మనం పాలన మీదే దృష్టి పెట్టి యూ ట్యూబ్ ఛానళ్ల లో వచ్చిన అడ్డగోలు దుష్ప్రచారాన్ని సమర్ధంగా తిప్పికొట్టలేకపోయామ‌ని కెటిఆర్ ఒప్పుకున్నారు.. ప్రగతి భవన్‌లో విలాస వంతమైన సౌకర్యాలూ అంటూ దుష్ప్రచారం చేశార‌న్నారు.. ఇప్పుడు ఉప ముఖ్య‌మంత్రి భట్టి అందులోనే ఉంటున్నారని ఎద్దేవా చేశారు. నిజంగా ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో విలాసాలే ఉంటే భట్టి ఈ పాటికే బిఆర్ఎస్ ను ఎండ‌గ‌ట్టేవార‌ని చెప్పారు.

- Advertisement -

క‌మిటీలు వేయ‌క‌పోవ‌డంతోనే న‌ష్ట పోయాం…
గ్రామ స్థాయి నుంచి పార్టీ కమిటీ లు కూడా పూర్తిగా వేయక పోవడం వల్ల నష్టం జరిగింద‌న్న కెటిఆర్ ఇక ముందు ఆలా జరగదన్నారు. మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశం నిర్వహించుకుందామ‌న్నారు. కారు కేవలం సర్వీసింగ్‌కు వెళ్లి మళ్లీ రెట్టింపు వేగంతో పరుగెత్తుతుందని అన్నారు. పీఎం మోదీకి, సీఎం రేవంత్‌రెడ్డికి భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ గొంతుక బీఆర్ఎస్‌ను ఖతం చేయాలని చూస్తున్నాయని అన్నారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు.. మైనారిటీల్లో ఉన్న అపోహలను తొలగించాలని కేటీఆర్‌ అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లా రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనాచారి, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement