Wednesday, May 1, 2024

Kishan Reddy – తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తే నీతివంత‌మైన పాల‌న అందిస్తాం….

హ‌న్మ‌కొండ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బొమ్మ, బొరుసు లాంటివని.. ఆ రెండు పార్టీల డీఎన్ఏ ఒకటేనని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ ఏనాడూ కాంగ్రెస్‌తో గానీ, బీఆర్ఎస్‌తో గానీ కలిసిన దాఖలాలు లేవన్నారు. కానీ . గతంలో ఆ రెండు పార్టీలు కలిసి పని చేశాయని, ప్రభుత్వాన్నీ పంచుకున్నాయని అన్నారు. వరంగల్ జిల్లాలోని హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానాన్ని సందర్శించిన కిషన్ రెడ్డి అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ సభా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సభా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా బీజేపీపై అబద్ధాలు కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడుతున్నామో మోడీ వివరిస్తారని వెల్లడించారు. కల్వకుంట్ల కుటుంబ పాలనకు చరమగీతం పాడేలా బీజేపీ కృషి చేస్తోందన్నారు.

క‌ల్వ‌కుంట స‌ర్కార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ఆ కుటుంబ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్‌కు పరిమితం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కేసిఆర్ ప్రభుత్వం కమిషన్‌ల, వాటాల ప్రభుత్వంగా మారిందని వ్యాఖ్యానించారు. పెట్టుబడుల ప్రభుత్వంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని బహుళజాతి కంపెనీలకు భారత్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని అన్నారు. అతిపెద్ద ఆర్థికాభివృద్ధి దేశంగా ఐదోస్థానంలో మనం ఉన్నామన్నారు. తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే నిజమైన, నీతివంతమైన పాలనను తీసుకువస్తామని హామీ ఇచ్చారు. దేశంలో నీతివంతమైన పాలన మోడీ నేతృత్వంలో కొనసాగుతోందన్నారు. మోడీ స్ఫూర్తితో తెలంగాణలో కుటుంబరహిత నీతివంతమైన పాలనను తీసుకొస్తామన్నారు.

ఇక చారిత్రాత్మకమైన వరంగల్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి వస్తున్నారన్నారు. రూ.6,109 కోట్లు జాతీయ రహదారులకు, రూ.521 కోట్లతో కాజీపేటలో రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు మోడీ శంకుస్థాపన చేస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. తొలి దశలో రూ.521 కోట్లతో రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ని ఏర్పాటు చేస్తున్నామని.. దీని వల్ల 3వేల మందికి ఉద్యోగా అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇందుకు తాను ప్రధాని మోడీకి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాల అనంతరం మోడీ విజయ సంకల్ప సభలో ప్ర‌సంగిస్తార‌ని వెల్ల‌డించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement