Tuesday, April 30, 2024

Khammam – విధులు, విధివిధానాలపై అవగాహన పెంపొందించుకోవాలి – ట్రైనీ కానిస్టేబుళ్లకు సిపి సునీల్ దత్ హితవు

ఖమ్మం .. ట్రైనీ కానిస్టేబుళ్లు చట్టాలు, నిభందనలపై పూర్తి అవగాహన పెంపొందించుకొని భాధ్యతయుతమైన విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. తొమ్మిది నెలల పోలీస్ శిక్షణలో భాగంగా సిటీ పోలీస్ శిక్షణ కేంద్రంలో రెండు నెలల శిక్షణ పూర్తి చేసుకొని విజయవంతంగా ముందుకు వెళ్తున్న సివిల్‌ స్టైపెండరీ క్యాడెట్‌ ట్రైనీ పోలీస్‌ కానిస్టేబుళ్ల (ఎస్‌సీటీపీసీ) శిక్షణ కార్యక్రమంలో భాగంగా మౌలిక సదుపాయాలు, బందోబస్తులో విధివిధానాలు, శిక్షణ అంశాలపై పోలీస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇంట్రాక్షన్ మీట్ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..పోలీసులు తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించడం అనేది ప్రజల నుంచి అందే సహకారంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఇప్పటికే మూడు నెలల శిక్షణలో ఇండోర్, ఆవుట్ డోర్ శిక్షణ మంచి తర్ఫీదు పొందుతున్నారని అన్నారు.

అదేవిధంగా లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్వేచ్ఛాయుత వాతావరణంతో కూడిన నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా ఎన్నికల బందోబస్తు విధులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ట్రైనీ కానిస్టేబుళ్ల యెుక్క విధులు, విధివిధానాలపై అవగాహన వుండాలని అన్నారు.


ప్రధానంగా ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణకు లోబడి పనిచేయాలన్నారు. ఎన్నికల నియమావళిపై సమగ్ర అవగాహన ఏర్పర్చుకుని, ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని స్పష్టంచేశారు. విధుల పట్ల అంకితభావం, నిబద్ధతతో అప్పగించిన భాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు.

పోలీస్ శాఖలో చేరి శిక్షణ పొందుతున్న ట్రైనీ కానిస్టేబుళ్లు లోకసభ ఎన్నికలలో బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుందన్నారు. శిక్షణలో నేర్చుకున్న విధంగా మన లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ప్రజల భాగస్వామ్యం, సమాజంతో చక్కని సంబంధాలు, మానవ హక్కుల పట్ల గౌరవం, సాటి ఉద్యోగులతో సమన్వయం, సహాయ సహకారాలు ఎంతో అవసరమని గుర్తించాలని అన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని నిలువరించేందుకు ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోందని, అందలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఫ్లైయింగ్ స్క్వార్జ్ టీమ్స్, చెక్ పోస్టులు, మొబైల్ పార్టీలు, ఎన్నికల ముందు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు సందర్భంగా నిర్వహించే విధులలో పూర్తి అవగాహన వుండాలన్నారు. అదేవిధంగా ఎన్నికల సభలు, సమావేశాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలతో అప్రమత్తంగా వుండాలని సూచించారు.

- Advertisement -

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ గణేష్, ఏఆర్ అడిషనల్ డీసీపీ విజయబాబు, ఏఆర్ ఏసీపీ నర్సయ్య , ఆర్ ఐ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement