Saturday, May 4, 2024

NZB: కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష.. మంత్రి వేముల

కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ కార్యక్రమాలు, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ముప్కాల్ మండలం రేంజర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజెపి నాయకులు, తటస్థులు ఏర్గట్ల మండలం నాగేంద్ర నగర్ గ్రామం కాంగ్రెస్, బిజెపిల నుండి పలువురు యువకులు సుమారు 200 మంది ఇవాళ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ.. తలెత్తుకుని నిలబడాలనేదే కేసీఆర్ తపన అని మంత్రి అన్నారు. తెలంగాణ అంతా ఒకే కుటుంబమైతే ఆ ఇంటి పెద్ద కేసీఆర్ అని, కుటుంబం ఎప్పుడూ బాగుండాలని ఇంటి పెద్ద ఆరాట పడుతాడని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రజలు దేశంలోనే అత్యంత ఉన్నతంగా బ్రతకాలని కేసీఆర్ తపనపడుతారని గుర్తు చేశారు. హరితాహారం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 9శాతం గ్రీనరి పెరిగిందని, ఇంత పచ్చదనం పెంపు ప్రపంచంలోనే ఎక్కడా సాధ్యం కాలేదన్నారు. సమాజ హితం, భవిష్యత్ తరాల కోసం మాత్రమే చేపట్టిన కార్యక్రమమని, ఓట్ల కోసమో, రాజకీయం కోసమో చేసింది కాదని వివరించారు. ఇంటింటికీ సురక్షిత నల్లా నీరు అందుతుందంటే దాని వెనుక కేసీఆర్ నిద్ర లేని రాత్రులు ఎన్నో ఉన్నాయని, కేవలం ఆయన అకుంఠిత దీక్ష వల్లే 3 ఏళ్లలో అది సాధ్యమైందన్నారు. ప్రతీ పథకం మానవీయ కోణంలో ఆలోచించి ప్రవేశపెట్టిందే అని అన్నారు. ఒకప్పుడు నీటికి, కరెంట్ కు కటకట ఉండేదని, ఎరువుల కోసం చెప్పులు లైన్లు పెట్టిన రోజులు ఉన్నాయని గుర్తు చేశారు.

నేడు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులతో, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం రివర్స్ పంపింగ్ ద్వారా లిఫ్ట్ ల నుండి వాగులు, చెరువులు నింపుకోవడం, చెక్ డ్యాంలు నిర్మించుకుని నీటిని ఒడిసిపట్టడంతో యాసంగిలో కూడా భూమి బీడు లేకుండా పంటలు సమృద్దిగా పండుతున్నాయన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఉప్పు, పప్పు, కారం, నూనె నిత్యావసర ధరలు పెంచిన బీజేపీ మోడీ ప్రభుత్వం వల్ల గోసపడని కుటుంబమే లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల బాగు కోరేది కేసీఆర్ అయితే… తెలంగాణ ప్రజల ఓట్లు కోరేది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అని, మోసపు మాటలతో, అబద్ధపు హామీలతో ఎన్నికల వేళ వస్తున్న కాంగ్రెస్, బీజేపీల పట్ల రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులన్నా, పేదలన్నా గిట్టని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకునే కేసీఆర్ కు అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలని, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మంత్రి వేముల పునరుద్ఘాటించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement