Sunday, June 23, 2024

ఇది రైతు ప్రభుత్వం …అన్నదాతలు దిగులు చెందవద్దు – కెసిఆర్

ఖమ్మం : ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు పునరావాస సహాయం అందజేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. గురువారం ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల, గార్లపాడు గ్రామాల్లో పంట నష్టం క్షేత్ర స్థాయిలో పరిలీలన అనంతరం మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలతో కలిసి రావినూతలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాస్తవానికి రైతులకు ఇచ్చే దాన్ని నష్టపరిహారం అనరని, సహాయ పునరావాస చర్యలు అని అంటారని తెలిపారు. రైతులకు అండగా ఉంటూ, అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. గాలివాన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 22వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొక్కజొన్న 1,29,446, వరి 72,709, మామిడి 8,865, ఇతర పంటలు అన్ని కలిసి 17,238 ఎకరాల్లో నష్టం జరిగింది. ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. ఫలితంగా వ్యవసాయం ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుని రైతులు స్థిరపడే పరిస్థితికి వస్తున్నారని, అప్పుల నుంచి కూడా తేరుకుంటున్నారని అన్నారు. వ్యవసాయం దండగ అని చెప్పే మూర్ఖులు ఇప్పటికీ చాలామంది ఉన్నారని, ఈ మాటలు చెప్పేవాళ్లలో ఆర్థికవేత్తలు కూడా ఉన్నారని, కానీ మేం గర్వంగా చెబుతున్నాం ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే నంబర్‌వన్‌గా ఉందన్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కంటే కూడా అత్యధికంగా తలసరి ఆదాయం రూ. 3,05,000తో మన రాష్ట్రం ఉందన్నారు. జీఎస్‌డీపీ పెరిగితేనే తలసరి ఆదాయం పెరుగుతుందని, జీఎస్‌డీపీ పెరుగుదలలో వ్యవసాయం పాత్రే అధికంగా ఉందన్నారు. కొన్ని సందర్భాల్లో ఈ వాటా 21 శాతం ఉండగా, సరాసరి 16 శాతం వరకు ఉందని సీఎం తెలిపారు. అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని, ఇది మనకు చాలా గర్వకారణమని తెలిపారు. రైతులు నిరాశకు గురికావద్దని, ప్రభుత్వం అండదండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇంకా అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా రూపుదాల్చాలని చెప్పారు.


ఈ దేశంలో ఓ పాలసీ లేదని, ఇన్సూరెన్స్‌ కంపెనీలకు లాభం కలిగించే బీమాలే ఉన్నాయి తప్ప, రైతులకు లాభం చేసే బీమాలు, కేంద్ర ప్రభుత్వ పాలసీలు లేవని ఆయన అన్నారు. భారతదేశానికే కొత్త అగ్రికల్చర్‌ పాలసీ కావాలన్నారు. గతంలో జరిగిన నష్టాలకు సహాయం కోసం నివేదికలు పంపితే కేంద్రం నుండి సహాయం రాలేదని, అందుకే ఈసారి కేంద్రానికి నివేదిక పంపాలని అనుకోవట్లేదని సీఎం తెలిపారు. భగవంతుడు తెలంగాణకు ఆర్థిక శక్తి ఇచ్చాడని, కాబట్టి మా రైతులను మేమే కాపాడుకుంటామని, వంద శాతం మేమే ఆదుకుంటామని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మొక్కజొన్నకు అయితే ఎకరానికి రూ.3,333 లు, వరి చేళ్లకు రూ. 5,400 లు, మామిడి తోటలకు రూ. 7,200 ఇస్తామని స్కీంలో ఉందన్నారు. ఇది ఏ మూలకు సరిపోదు కాబట్టి రైతులను మేమే ఆదుకుంటామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఉచిత కరెంట్‌, ఉచిత నీళ్లు, వాటర్‌ సెస్‌ బకాయి రద్దు చేసి రైతులను ఆదుకోవడం వల్ల వ్యవసాయం ఇప్పుడిప్పుడే బాగుపడుతుందన్నారు. ఆ స్థితిని దెబ్బతీయనివ్వకూడదని, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం కానివ్వమని సీఎం అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నిరాశపడొద్దని, ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని ఆయన తెలిపారు. నష్టపరిహారం అనేది ప్రపంచంలో ఎవరూ ఇయ్యలేరని, రైతులు మళ్లీ పుంజుకుని, వ్యవసాయం చేసేందుకు వీలుగా సహాయ సహకారాలు అందించాలని, అందుకే ఎకరానికి 10వేలు ప్రకటిస్తున్నాన్ని వెంటనే వీటిని అందజేస్తామని ఆయన అన్నారు. స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కౌలు రైతులను కూడా ఆదుకుంటాం. ఈ డబ్బును నేరుగా రైతులకు ఇవ్వకుండా, ప్రతి రైతుతో పాటు కౌలు రైతులను కూడా పిలిపించి ఆదుకునేలా కలెక్టర్ కు ఆదేశాలిస్తామన్నారు. పంటకు పెట్టుబడి పెట్టింది కౌలు రైతులే కాబట్టి వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తామని, జరిగిన నష్టానికి ఏ మాత్రం చింతించకుండా, రబ్బర్‌ బంతి తిరిగొచ్చినట్లుగా, భవిష్యత్తులో ఉన్నతమైన పంటలను పండించే ఆలోచనతో రైతులు ముందుకు పోవాలని, ఎట్టిపరిస్థితుల్లో ధైర్యాన్ని వీడొద్దని సీఎం రైతుల్లో భరోసా నింపారు. రాష్ట్రంలో పంట దెబ్బతిన్న 2.28 లక్షల ఎకరాలకు రూ. 228 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు.


ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్, రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, మెచ్చ నాగేశ్వరరావు, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ నిర్మల, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement