Saturday, March 16, 2024

లక్ష్మీపూర్ లో పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్

రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం ల‌క్ష్మీపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. గాయత్రీ పంప్ హౌస్ వద్ద సీఎం కు మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎంఎల్ఏ సుంకే రవిశంకర్, కలెక్టర్ కర్ణన్, సి పి సుబ్బారాయుడు స్వాగతం పలికారు. గాయత్రీ పంప్ హౌస్ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో గ్రావిటీ కెనాల్ పక్కన వున్నా పంటపొలాలను, తోటలను పరిశీలించి రైతుల నుండి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మీకు అండగా వుంటుందని రైతులకు భరోసా కల్పించారు. కరీంనగర్ జిల్లాలో వడగళ్ల వాన, అకాల వర్షాలకు 13,300 ఎకరాల్లో వరి, 5,800 ఎకరాల్లో మొక్కజొన్న, వెయ్యి ఎకరాల్లో మామిడి, ఇతర పంటలు 250 ఎకరాల్లో మొత్తం 22,950 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని సీఎం కు కలెక్టర్ వివరించారు.

రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాం :

రాష్ట్రంలోని రైతాంగాన్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రాపూర్ లో వడగళ్ళ వానతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ… ప్రపంచంలో ఎక్కడా రైతుబంధు లేదని, తెలంగాణలోని ప్రతి రైతుకు ఎకరానికి ప్రతి ఏడాదికి పదివేల రూపాయల పంట పెట్టుబడి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. నష్టపోయిన ప్రతి ఎకరానికి పదివేల రూపాయల పరిహారం అందిస్తామన్నారు. కేంద్రానికి చెప్పినా దున్నపోతుకు చెప్పినా ఒక్కటేనన్నారు. రాష్ట్ర నిధుల నుండి ప్రతి రైతుకు పరిహారం అందిస్తామన్నారు. నష్టపరిహారం కోసం 228 కోట్ల రూపాయలను మంజూరు చేశామన్నారు. ఇందుకు సంబంధించి జీవో కూడా విడుదల చేశామన్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా వడగళ్ల వాన పడే అవకాశం ఉందని, రైతాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం దేశం మొత్తంలో వరి ఎంత పండుతుందో రాష్ట్రంలో కూడా అంతే మొత్తంలో వరి పండుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement