Sunday, April 28, 2024

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి

హుజురాబాద్ నియోజకవర్గ టిఆర్ఎస్ యువనేత పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి ఎంపికకు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. క్రికెటర్ గా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన వీణవంక మండల కేంద్రానికి చెందిన కౌశిక్ రెడ్డి మొదట కాంగ్రెస్ లో చేరారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తోడల్లుని కుమారుడైన కౌశిక్.. ఇటీవల జరిగిన హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ముందు కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ లో చేరి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ కోరారు. కాగా అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ను బీసీ వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ఇవ్వగా, గవర్నర్ కోటలో పాడి కౌశిక్ రెడ్డి పేరును ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు. కానీ గవర్నర్ కౌశిక్ పేరును పెండింగ్ లో పెట్టారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఇది చర్చనీయాంశమైంది.

కాగా తాజాగా ఎమ్మెల్యేల కోటాలో కౌశిక్ రెడ్డి పేరును గులాబీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 10న నామినేషన్ కు సిద్ధంగా ఉండాలని సీఎం సన్నిహితుల నుండి ఆదేశాలు రావడంతో కౌశిక్ రెడ్డికి గతంలో అధిష్టానం ఇచ్చిన హామీ ఇక లాంఛనమేనని తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి నాడు టిఆర్ఎస్ బరిలో ఉన్న ఈటలకు కౌశిక్ గట్టి పోటీ ఇచ్చి సుమారు 62 వేల ఓట్లు తెచ్చుకున్నారు. గత పరిస్థితులు పరిగణనలోకి తీసుకుని కౌశిక్ రెడ్డిని ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లోకి తీసుకుని ఆ పార్టీకి టీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. కాగా కౌశిక్ రెడ్డిని రాబోయే రోజుల్లో హుజురాబాద్ తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పై విమర్శలకు ఉపయోగించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై ఇప్పటికే పలుసార్లు ఘాటు విమర్శలు కౌశిక్ రెడ్డి చేస్తూ వచ్చారు. స్థానికంగా కూడా బీజేపీకి.. ముఖ్యంగా ఈటలకు ధీటుగా నియోజకవర్గంలో బలమైన నేతగా కౌశిక్ ను ప్రయోగించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి కి మొదట్లో ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి ఖరారైనట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి తన ఇన్నింగ్స్ ను హుజురాబాద్ లో ప్రారంభించనున్నారు. ఇటు ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల, అటు ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి ఎన్నిక కానున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. అధికార పార్టీగా ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి స్థానిక రాజకీయాల్లో తన మార్క్ ప్రదర్శిస్తారనే ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement