Tuesday, May 7, 2024

రేపు పవన సుతుని చెంతకు పవన్ కళ్యాణ్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈనెల 24న హైదరాబాద్ నుండి బయలుదేరి 11 గంటలకు కొండగట్టుకు చేరుకుంటారు. కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం వారాహి వాహన పూజ జరుపుతారు. నాచుపల్లి శివారులోని బృందావన్ రిసార్ట్ లో పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పవన్ పాల్గొంటారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం చేపట్టబోయే కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ చర్చించి దిశానిర్దేశం చేస్తారు. ఇదే రోజున అనుష్టుప్ నారసింహయాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన) ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారు. ఈ యాత్రలో భాగంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారు. అనంతరం మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి.

ఏపీ రాజకీయాలకే పరిమితమైన పవన్.. తెలంగాణలో పర్యటించి చాలా రోజులైంది. చాలాకాలం తర్వాత పవన్ తెలంగాణలో పర్యటిస్తుండటంతో.. రాష్ట్ర జనసేన పార్టీ వర్గాల్లో జోష్ నెలకొంది. ఈ పర్యటనను సక్సెస్ చేసేందుకు జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ నేతలతో జరగనున్న సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, జనసేన వ్యూహంపై పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశముంది. తెలంగాణలో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఇటీవల పవన్ ప్రకటించారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది రాష్ట్ర నేతలే నిర్ణయించుకోవాలని సూచించారు. రెండు లేదా మూడు లోక్‌సభ స్ధానాల్లో బరిలోకి దిగుతామని గతంలో స్పష్టం చేశారు. కొండగట్టు నుంచి తాను తెలంగాణ రాజకీయాలను ప్రారంభిస్తానంటూ పవన్ తెలిపారు. కొండగట్టుతో పవన్‌కు ప్రత్యేక అనుబంధముంది. తెలంగాణ నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా.. కొండగట్టు నుంచే పవన్ ప్రారంభిస్తారు. గతంలో కూడా అనేక‌ కార్యక్రమాలను కొండగట్టు నుంచే మొదలుపెట్టారు. ఇప్పుడు వారాహికి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి ఆ సెంటిమెంట్‌ను పవన్ కొనసాగించనున్నారు. ఈ పర్యటన తర్వాత ఏపీతో పాటు తెలంగాణ రాజకీయాల్లో పవన్ స్పీడ్ పెంచనున్నారని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement