Monday, April 29, 2024

ప్రతిపక్షాలకు మరోసారి భంగ పాటే.. పెద్దపల్లిలో ఎగిరేది గులాబీ జెండే.. ఎమ్మెల్యే దాసరి

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు మరోసారి భంగపాటు తప్పదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఇంటింటా ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 23వ వార్డులో పర్యటించారు. కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ… గత ఐదు దశాబ్దాలుగా జరగని అభివృద్ధి 9ఏళ్లలో చేసి చూపాము కనకే మరోసారి ధైర్యంగా ఓటు అడుగుతున్నామన్నారు. ప్రతిపక్షాల మాయమాటలు నమ్మే పరిస్థితి లేదని, వారు అధికారంలో ఉండగా ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ అసత్యపు ప్రచారాలు చేస్తుందని, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 4వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు.

అధికారం కోసం మాయమాటలు చెబితే నమ్మేస్థితిలో ప్రజలు లేరన్నారు. హైటెక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని, పెద్దపల్లిలో ఎగిరేది గులాబీ జెండా మాత్రమే అన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన పెద్దపల్లిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిందన్నారు. జిల్లా కేంద్రంలోని అన్ని ప్రధాన రహదారులను విస్తరించడంతో పాటు డివైడర్లను ఏర్పాటు చేసుకుని, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. కరోనా వల్ల అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరిగిందని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement