Wednesday, May 15, 2024

కాంగ్రెస్ పార్టీనీ విమర్శించే అర్హత మోడీకి లేదు : ములుగు ఎమ్మెల్యే సీతక్క

కాంగ్రెస్ పార్టీనీ విమర్శించే అర్హత మోడీకి లేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే చలించిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే, అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అనడం చాలా విడ్డూరంగా ఉందని సీతక్క అన్నారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తీరు గురించి మాట్లాడటం బాధాకరమ‌ని తెలంగాణ పట్ల మోడీ చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మోడీ దేశానికి ప్రధాన మంత్రిననే విషయాన్ని మర్చిపోయారని విమర్శించారు. తాను ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రిననే అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఒక దేశాన్ని పరిపాలిస్తోన్న ప్రధానమంత్రి స్థాయి నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కావన్నారు.

తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి.. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందే తప్ప- ఓట్ల కోసమో.. రాజకీయ ప్రయోజనాల కోసమో.. ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతోనే కాదని సీతక్క స్పష్టం చేశారు. కోట్లాదిమంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది కాంగ్రెస్సేనని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, ఫిషర్ మేన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, ములుగు ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి, అబ్బాపూర్ సర్పంచ్ గండి కల్పన కుమార్, అల్లెం సదానందం, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కిషోర్, మురళి, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement