Tuesday, April 30, 2024

ఇంద్రవెల్లి అమరుల పోరాట స్ఫూర్తి కొనసాగిద్దాం.. మావోయిస్టు లేఖ‌..

గోదావరిఖని, ఏప్రిల్‌ 21 (ప్రభన్యూస్‌): ఇంద్రవెల్లి అమరుల పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ.. ఆదివాసులకు అండగా నిలుద్దామని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కోల్‌ బెల్ట్‌ ఏరియా కార్యదర్శి ప్రభాత్‌ లేఖలో పేర్కొన్నారు. శుక్రవారం పాత్రికేయులకు పోస్టు ద్వారా పంపిన లేఖలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. 1981 ఏప్రిల్‌ 20న ఇంద్రవెల్లి మానని గాయంగా మిగిలిందని, 42 ఏళ్ల ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిని సమరోత్సాహంతో జరుపుకుందామని పిలుపునిచ్చారు. ఇంద్రవెల్లి అమరులకు జోహార్లర్పిస్తూ అటవీ భూములకు పట్టాలకై పోరాడుతూ ఆదివాసులకు అండగా ఉందామన్నారు. అటవీ భూములకు పట్టాలు, ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసం ఇంద్రవెల్లిలో పీపుల్స్‌ వార్‌ పార్టీ నాయకత్వంలో మహా సభను జరిపేందుకు రైతు కూలీ సంఘం చేపట్టిన ఇంద్రవెల్లి మహా సభ పోలీసుల పాశవిక దాడిలో రక్తసిక్తంగా మారిందని గుర్తు చేసుకున్నారు. మరో జలియన్‌ వాలా భాగ్‌ను తలపించేలా వందలాది మంది అమరులై, వేలాది మంది గాయాల పాలయ్యారని వివరించారు. పాలకులు రైతులు, ఆదివాసీలు, రైతు కూలీలపై ఎలాంటి హెచ్చరికలు చేయకుండా విచక్షణ రహితంగా దాడులు చేసి ఎంతో మంది ప్రాణాలను పొట్టన బెట్టుకున్నారన్నారు. ఆనాటి అమరవీరుల పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకొని పాలకులపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణలో ఓట్ల రాజకీయాలతో ఆది వాసులను బలి పశువులను చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.

11 కులాలను ఎస్టీ జాబితాలో చేరెదుకు తీర్మానం చేయడంతో ఆదివాసీల మనుగడకు ప్రమాదం పొంచి ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీలు సామ్రాజ్యవాద బహుళ జాతి కంపెనీలకు, కార్పోరేట్‌ శక్తులకు తలొగ్గి పాలన సాగిస్తున్నాయన్నారు. 1/70 చట్టం, పేసా చట్టం, 5, 6 షెడ్యూల్‌ జీఓ నం.3 అమలు చేయాలని, ఆదివాసీ గూడాలలో ఎత్తివేసిన పాఠశాలలను పునరుద్ధరించాలని, ఆదివాసీ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, వైద్యులను అందుబాటులో ఉంచాలని, గిరిజన యూనివర్సిటీ ఆదిలాబాద్‌ జిల్లాలో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీస్‌, ఫారెస్టు అధికారుల దాడులను అరికట్టాలని, ఓపెన్‌ కాస్టు గనుల్లో భూములు కోల్పోయిన ఆదివాసీలకు ఉద్యోగాలు కల్పించాలని, దేవాపూర్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలో భూములు కోల్పోయిన ఆదివాసీలకు నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖని పట్టణంలో నిరుపేదల ఇళ్ల కొసం చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దరఖాస్తులు చేసుకున్న ప్రతీ నిరుపేదకు భూములు ఇప్పించాల్సిన బాధ్యత రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, పద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత, మంత్రి కొప్పుల ఈశ్వర్‌లపైనే ఉందన్నారు. నిరుపేదల ఇళ్ల నిర్మాణాలకు ఒక్కొక్కరికి రూ. 10లక్షలు ఇప్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదేనని స్పష్టం చేశారు. భూ పోరాటం చేస్తున్న నిరుపేదలకు మావోయిస్టు పార్టీ అండగా ఉంటుందని, ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న పేదలకు ప్రజాస్వామ్య వాదులు, ప్రజలు, ప్రజాసంఘాలు అండగా నిలవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement