Thursday, April 25, 2024

ధాన్యం లారీలను రప్పించాలి.. అధికారుల‌ను నిలదీసిన రైతులు..

రెంజల్, ప్రభ న్యూస్: మండలంలోని బోర్గం గ్రామంలో ఇందిరా కాంతి పతం(ఐకేపి) ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమై ఐదు రోజులు కావస్తున్నా నేటికీ ఒక లోడ్ కూడా తరలి వెళ్లకపోవడం ఏమిటని ఏపీడి మధుసూదన్, డిపిఎం సాయిలును రైతులు నిరదీశారు. శుక్రవారం మండలంలోని రెంజల్, అంబేద్కర్ నగర్,బోర్గం గ్రామాలలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.బోర్గం గ్రామంలో ధాన్యాన్ని తూకం చేయడం ప్రారంభించి మూడు రోజులు కావస్తున్నా ఒక లారీ కూడా రాలేదని అధికారుల తీరును తప్పుపట్టారు. లారీలు లోడ్ చేయనిది తూకం చేయడం ఎందుకని గురువారం రైతులు నిలిపివేశారు. రాత్రింబవళ్లు వడ్ల కుప్పల వద్ద కాపలా ఉంటున్నామని, మా గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యారని అధికారుల ముందు రైతులు ఆవేదన వెళ్లగక్కారు. అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దవుతుందని, దాని నుండి నష్టపోయే ఆస్కారం ఉందని విన్నవించారు. తూకం చేసిన బస్తాలను లారీలు తెప్పించి లోడు చేయాలని లేదంటే రోడ్డెక్కి ఆందోళనకు దిగుతామని రైతులు పట్టుబట్టారు.అధికారులు చేసేది ఏమీ లేక లారీలను రప్పించేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడారు. కొన్ని గ్రామాలలో హమాలీలు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి వెంట ఏపిఎం చిన్నయ్య, సిసి కృష్ణ, రైతులు మేత్రి రాజు, ఆశడి భూమయ్య, తదితరులు ఉన్నారు.

కొనుగోలు కేంద్రాల పరిశీలన…
రెంజల్, అంబేద్కర్ నగర్ గ్రామాలలోని కొనుగోలు కేంద్రాలను మధుసూదన్, సాయిలు పరిశీలించారు. తూకం చేస్తున్న తీరును అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు.తూకంలో ఎలాంటి పొరపాటు లేకుండా జాగ్రత్త వహించాలని హమాలీలను ఆదేశించారు. అందుకు కేంద్రం ఇన్చార్జిలు పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు.వారి వెంట ఏపిఎం చిన్నయ్య,డిప్యూటీ తహాసిల్దార్ శశిభూషణ్,కేంద్రం ఇన్చార్జీలు శ్యామల,తస్లీమ్, రైతులు భాస్కర్ రెడ్డి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement