Friday, April 26, 2024

సెస్ ఎన్నిక‌ల‌లో గెలువ‌లేని వాళ్లు అసెంబ్లీకి గెలుస్తారా – బిజెపికి కెటిఆర్ చుర‌క‌లు

సిరిసిల్లా – సెస్ ఎన్నిక‌ల‌లోనే గెలువ‌లేని బిజెపి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌లో గెలుస్తారా అంటూ ప్ర‌శ్నించారు మంత్రి కెటిఆర్… రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సెస్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా వినియోగదారులు, రైతులతో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఆయ‌న మాట్లాడుతూ, బిజెపి రాష్ట్ర నేత‌ల‌పై నిప్పులు చెరిగారు.. తెలంగాణలో బీజేపీని నడిపేవాళ్లు మూర్ఖులని అంటూ మెదడు ఎక్కడుంది? మోకాళ్లలో ఉందా? అంటూ ప్ర‌శ్నించారు. దమ్ముంటే తమకంటే ఎక్కువగా మంచి పనులు చేసి ప్రజల మనసులను గెలవాలని హితవు పలికారు. సెస్ ఎన్నిక‌ల‌లో ట్రైల‌ర్ మాత్ర‌మే చూశార‌ని, 2023లో అసలు సినిమా చూపిస్తామ‌ని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీని దేవుడంటూ బండి సంజ‌య్ కీర్తించ‌డం ప‌ట్ల కెటిఆర్ త‌ప్పు పట్టారు.. ఎవరికి దేవుడు..? నీకా? గుజరాత్‌ కా? అంటూ బండి ని నిలదీశారు. పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెంచినోడని, నల్లచట్టాలు తెచ్చి రైతులను చంపినోడు దేవుడట.. చేనేత మీద పన్నువేసినోడు దేవుడా? అంటూ ప్ర‌శ్నించారు. డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచుతూ ఆర్టీసీ ధరలు పెంచొద్దంటారని,మరి బస్సులు ఎలా నడుపమంటారని ధ్వజమెత్తారు. కేంద్ర ధరలు పెంచడంలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయని స్పష్టం చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు గొడవ నడుస్తుందన్న ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రాల గొడవ పరిష్కరించని మోడీ రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ఆపారా? అని ప్రశ్నించారు. 14 మంది ప్రధానులు చేసిన అప్పు మోడీ ఒక్కరే చేశారని విమర్శించారు. కిషన్‌రెడ్డి కరోనా సమయంలో కుర్‌కురే ప్యాకెట్లు పంచారని విమర్శించిన కేటీఆర్‌.. తెలంగాణకు కేంద్ర నిధుల విషయంలో సవాల్‌ విసిరారు.రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.1.68లక్షల కోట్లు వెళ్లాయని, కేంద్రం తెలంగాణకు రూ.2లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. నేను చెప్పింది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. గుజరాత్‌ వాళ్లు వస్తే చెప్పులు మోయడానికి పని చేస్తారని, నాలుగేళ్లలో కరీంనగర్‌కు ఎంపీగా ఉండి బండి సంజయ్‌ ఏం చేశాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ట్రిపుల్‌ ఐటీ, నవోదయ పాఠశాలలు తీసుకువచ్చావా? అంటూ నిలదీశారు. రాజరాజేశ్వరస్వామికి రూ.10 చందా అయినా రాయించావా? అంటూ ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్ల అభివృద్ధిలో దేశం మొత్తంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేయాలని, సిరిసిల్ల జిల్లా సెస్‌ పరిధిలో ప్రత్యేక విద్యుత్‌ ప్రణాళిక రూపొందించాల‌ని కొత్త‌గా ఎన్నికైన స‌భ్యుల‌ను కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement